ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : గురువారం, 9 నవంబరు 2023 (15:53 IST)

పిండం టీజర్ ది స్కేరియస్ట్ ఫిల్మ్ అనే క్యాప్షన్ కి తగ్గట్టుగానే ఉంది : దర్శకుడు అనిల్ రావిపూడి

Anil ravipudu pindam team
Anil ravipudu pindam team
ప్రముఖ హీరో శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటిస్తున్న చిత్రం ‘పిండం‘. 'ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
 
ఇటీవల విడుదలైన 'పిండం' ఫస్ట్ లుక్ కి, టీజర్ కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం నుండి 'జీవ పిండం' అనే పాటను విడుదల చేశారు మేకర్స్. నవంబర్ 9వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా జీవ పిండం గీతం విడుదలైంది.
 
పాటను ఆవిష్కరించిన అనంతరం ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, "పిండం చిత్ర టీజర్ చూశాను, అద్భుతంగా ఉంది. ది స్కేరియస్ట్ ఫిల్మ్ అనే క్యాప్షన్ కి తగ్గట్టుగానే ఉంది. మంచి ఆర్టిస్ట్ లు, మంచి టెక్నీషియన్స్ కలిసి పని చేసిన చిత్రమిది. శ్రీరామ్ గారు చాలారోజుల తర్వాత మళ్ళీ కథానాయకుడిగా చేస్తున్నారు. శ్రీరామ్ గారు, అవసరాల శ్రీనివాస్ గారు, ఖుషి మరియు మిగతా ఆర్టిస్ట్ లు అందరూ చాలా బాగా చేశారు. ఈ చిత్రంలోని జీవ పిండం సాంగ్ లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. సాంగ్ కూడా చాలా బాగుంది. పాటలోనే కథ ప్రయాణం ఎలా ఉండబోతుందో చెప్పారు. ఎంతో ఆసక్తికరంగా అనిపించింది. ఈ సినిమాని చూసి మీరు ఆదరించాలని కోరుకుంటున్నాను. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను." అన్నారు.
 
కృష్ణ సౌరభ్ సూరంపల్లి స్వరపరిచిన "జీవ పిండం బ్రహ్మాండం" అంటూ సాగిన పాట రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. అద్భుతమైన సంగీతంతో కృష్ణ సౌరభ్ మనల్ని పిండం ప్రపంచంలోకి తీసుకెళ్ళారు. కవి సిద్ధార్థ సాహిత్యం అందించిన ఈ గీతాన్ని అనురాగ్ కులకర్ణి ఆలపించారు. పాటలోని ప్రతి పంక్తిలో లోతైన భావం ఉంది. "మరణం చివరి చరణం కాదు.. జననమాగిపోదు", "ఏ పాపము సోకదు అమ్మలో.. ఏ దీపము మగలదు ఆమెలో" వంటి పంక్తులలో కవి సిద్ధార్థ తన కలం బలం చూపించారు. ఇక అనురాగ్ కులకర్ణి తన గాత్రంతో పాటను మరో స్థాయికి తీసుకెళ్ళారు. మొత్తానికి ఈ పాట పిండం చిత్రంపై అంచనాలను రెట్టింపు చేసింది.
 
‘పిండం‘ అనేది కంప్లీట్ హారర్ చిత్రంగా ఉండబోతుంది. ఇంతటి భయానక హారర్ చిత్రాన్ని టాలీవుడ్ ఇంతవరకూ చూడలేదని చిత్ర బృందం చెబుతోంది. పిండం కథ ప్రస్తుతం అలాగే 1990 మరియు 1930 లలో.. మూడు కాలక్రమాలలో జరిగేదిగా కనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనుంది.