శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Updated : ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (14:34 IST)

భారత్‌లో కరోనా 2.0కు 3 కారణాలు: అంతర్జాతీయ మీడియా

భారత్‌లో విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసుల పట్ల అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పొరుగు దేశం పాక్ కూడా తాజాగా సంఘీభావం ప్రకటించింది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులను అనుమతించమని ఇప్పటికే పలు దేశాలు ప్రకటించాయి. భారత్‌లోని పరిస్థితిపై అంతర్జాతీయ మీడియా కూడా విస్తృతంగా కథనాలు ప్రచురిస్తోంది. వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, ఏబీసీ(ఆస్ట్రేలియా) వంటి సంస్థలు భారత్‌లోని పరిస్థితిపై పలు వార్తలు ప్రచురించాయి. దేశంలోని కోవిడ్ 2.0పై అంతర్జాతీయ మీడియా విశ్లేషణ ఏమిటో చూద్దాం.
 
భారత్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి విచారకరమని వ్యాఖ్యానించిన వాషింగ్టన్ పోస్ట్.. జాగ్రత్తలు కొనసాగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపింది. ‘‘కరోనా ఆంక్షలు ముందస్తుగానే సడలించడంతో కరోనా పేట్రేగిపోయింది. ఇది సూదురంగా ఉన్న దేశంలోని సమస్య కాదు. ప్రస్తుత సంక్షోభ స్థితిలో ఎంతటి దూరాన ఉన్న దేశమైనా సమీపాన ఉన్నట్టే’’ అంటూ అమెరికా ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
అతివిశ్వాసం కారణంగానే కరోనాను ఎదుర్కొవడంలో భారత్ ప్రభుత్వం తడబడిందంటూ ది గార్డియన్ తన ఎడిటోరియల్‌లో ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇదే పత్రికలో ప్రచురితమైన మరో విశ్లేషణ.. భారత్‌లోని పరిస్థితి ప్రపంచానికి గుణపాఠం కావాలి అని కూడా వ్యాఖ్యానించింది.
 
ప్రభుత్వం తప్పటడుగులు, ప్రజల నిర్లక్ష్యమే సంక్షోభం తీవ్రమవడానికి కారణం అని న్యూయార్క్ టైమ్స్ స్పష్టం చేసింది. ఈ కారణాల రీత్యా విజయం దిశగా వెళుతున్న భారత్ కథ ఒక్కసారిగా మలుపు తిరిగింది అని పేర్కొంది. భారత్‌లో పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఇది ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని కూడా న్యూయార్క్ టైమ్స్ అభిప్రాయపడింది. ఇన్ఫెక్షన్లను నిరోధించడం, టీకాలు విస్తృతంగా అందుబాటులోకి తేవడమే ప్రస్తుతం భారత్ ముందున్న మార్గమని స్పష్టం చేసింది. 
 
కరోనా నిబంధనలను నిర్లక్ష్యం చేయడమే ప్రస్తుత పరిస్థితి కారణమని ఏబీసీ(ఆస్ట్రేలియా) తేల్చింది. సరైన చర్యలు తీసుకుని ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదనే అభిప్రాయం నిపుణుల్లో ఉందని పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో లోపాలు, ప్రజల్లో అలసత్వం, కొత్త వేరియంట్లు ఉనికిలోకి రావడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని ప్రచురించింది.
ఈ సంక్షోభానికి బాధ్యత ప్రభుత్వానిదే అని టైమ్స్ స్పష్టం చేసింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించింది. అంతేకాకుండా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు రాజకీయంగా పైచేయి సాధించడంపై దృష్టి పెట్టడంతో వైరస్ మరో దాడి చేసిందని వ్యాఖ్యానించింది. కరోనాను అడ్డుకోవడంలో రక్షణాత్మక విధానాన్ని త్యజించడం ద్వారా భారత్ మరిచిపోలేని తప్పు చేసిందని చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ వ్యాఖ్యానించింది. పేదరికం, జనాభా అధికంగా ఉన్న భారత్‌లో కరోనా కేసులు పెరుగుదల.. మరికొన్ని వారాలు పాటు కొనసాగుతుందని పేర్కొంది. భారత్‌‌ ఆస్పత్రుల్లో దర్శనమిస్తున్న దృశ్యాలు గుండెలు పిండేస్తున్నాయని పాకిస్థాన్‌కు చెందిన ‘డాన్’ పేర్కొంది.