శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : బుధవారం, 4 జులై 2018 (14:57 IST)

''మురారి'' హీరోయిన్ సోనాలీ బింద్రేకు క్యాన్సర్.. షాకిస్తూ ట్వీట్

''మురారి'' హీరోయిన్ సోనాలీ బింద్రే ఫ్యాన్స్‌కు చేదువార్త. ఉత్తరాది, దక్షిణాది సినిమాల్లో నటించిన సోనాలీ బింద్రే సినీ ప్రేక్షకులకు షాకిచ్చే ట్వీట్ చేసింది. తాను హై గ్రేడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు

''మురారి'' హీరోయిన్ సోనాలీ బింద్రే ఫ్యాన్స్‌కు చేదువార్త. ఉత్తరాది, దక్షిణాది సినిమాల్లో నటించిన సోనాలీ బింద్రే సినీ ప్రేక్షకులకు షాకిచ్చే ట్వీట్ చేసింది. తాను హై గ్రేడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు సోనాలీ బింద్రే ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్ చూసిన వారందరికీ ఒక్కసారిగా షాక్ తిన్నట్లైంది. 


వైద్యుల సలహా మేరకు హైగ్రేడ్‌ క్యాన్సర్‌కు చికిత్స చేయించుకునేందుకు న్యూయార్క్‌కు వెళ్తున్నట్లు సోనాలీ బింద్రే తన ట్విట్టర్‌లో తెలిపింది. క్యాన్సర్‌ చికిత్సలో ఎదురయ్యే ప్రతి సవాల్‌ను ధైర్యంగా ఎదుర్కొంటానని సోనాలీ బింద్రే స్పష్టం చేసింది. 
 
తెలుగులో మహేష్ బాబు, చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోలతో నటించి మంచి పేరు కొట్టేసిన సోనాలీ ప్రస్తుతం సినిమాలకు దూరంగా వున్నా.. ప్రకటనల్లో నటిస్తూ వస్తోంది. తిరిగి మంచి స్టోరీ దొరికితే సినిమాల్లో కనిపించాలనుకుంది. కానీ ఇంతలో తనకు క్యాన్సర్ వుందనే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించింది.

తనకు క్యాన్సర్ వుందనే  విషయం తెలియగానే కుటుంబసభ్యులు, సన్నిహితులు షాకయ్యారని.. అయినప్పటికీ తనకు మద్దతుగా నిలిచారని తెలిపింది. క్యాన్సర్‌ నుంచి తాను క్షేమంగా బయటపడాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పింది సోనాలీ బింద్రే.
 
కాగా.. 2001లో మహేశ్ బాబు హీరోగా నటించిన మురారి సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా సోనాలి బింద్రే పరిచయమైంది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. 2002లో మెగాస్టార్ చిరంజీవి సరసన ఇంద్ర సినిమాలో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత మెగాస్టార్‌తోనే శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో కలిసి నటించింది. 
 
ఖడ్గం సినిమాలో శ్రీకాంత్‌తో నటించి మంచి పేరు కొట్టేసింది. అక్కినేని నాగార్జునతో కలిసి నటించిన మన్మథుడు సినిమా సోనాలి కెరీర్‌లోనే అందమైన సినిమాగా నిలిచిపోయింది. తెలుగులో సోనాలి బింద్రే నటించిన సినిమాల్లో ఒక్క పల్నాటి బ్రహ్మనాయుడు తప్ప మిగిలిన సినిమాలన్నీ సూపర్ హిట్సే. ఆమె కెరీర్‌లో ప్రేమికుల రోజు సినిమా బంపర్ హిట్.
 
ప్రస్తుతం సోనాలి బింద్రే న్యూయార్క్‌లో క్యాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకుంటోంది. తాను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నానని సోనాలి సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో బాలివుడ్‌తో పాటు టాలివుడ్ దిగ్భ్రాంతికి గురైంది. సొనాలి త్వరగా కోలుకోవాలని అభిమానులు ట్విట్టర్‌లో కామెంట్లు చేస్తున్నారు. 
 
బాలీవుడ్ హీరోయిన్‌ మనీషా కోయిరాలా, అలనాటి తెలుగు హీరోయిన్‌ గౌతమి, లీసారేలు క్యాన్సర్‌ బారిన పడినా.. న్యూయార్క్‌లో చికిత్స చేయించుకోవడం ద్వారా క్యాన్సర్‌ను జయించారు. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నారు. ఇదే తరహాలో సోనాలీ కూడా చికిత్స ద్వారా క్యాన్సర్‌ను జయించి.. మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఆశిద్దాం..