గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శుక్రవారం, 4 జనవరి 2019 (11:38 IST)

జాతీయ దర్యాప్తు సంస్థకు కోడి కత్తి కేసు

వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన కోడి కత్తి దాడి కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ)కు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. నిజానికి ఈ కేసును ఎన్.ఐ.ఏకు అప్పగించాలని వైకాపా నేతలు గతంలోనే కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు శుక్రవారం ఈ కేసు విచారణను ఎన్.ఐ.ఏకు అప్పగిస్తూ ఆదేశించింది. 
 
విశాఖపట్నం విమానాశ్రయంలోని వీవీఐపీ లాంజ్‌లో గత యేడాది అక్టోబరు నెల 25వ తేదీన జగన్‌పై పక్కనే ఉన్న ఫ్యూజన్‌ఫుడ్స్‌ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న శ్రీనివాసరావు అనే వైకాపా కార్యకర్త కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. రక్షణ శాఖకు చెందిన తూర్పు నావికాదళం పర్యవేక్షణలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఈ దారుణ ఘటన వెనుక భారీ కుట్ర దాగి ఉందనేది ఒక్క రాష్ట్ర ప్రభుత్వం మినహా కేంద్రం మొదలు అన్ని రాజకీయ పక్షాలూ అనుమానిస్తూ వచ్చాయి. 
 
ఎయిర్‌పోర్ట్‌ భద్రతను పర్యవేక్షిస్తున్న కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్‌ఎఫ్‌) ఉన్నతాధికారులు కూడా ప్రాథమిక విచారణలో ఇదే నిర్ధారణకు వచ్చారు. దీంతో ఈ కేసును ఎన్.ఐ.ఏకు బదిలీ చేయాలని జగన్ తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తు ఆలస్యమైతే సాక్ష్యాధారాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని పిటిషనర్‌ తరుపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
 
అదేసమయంలో ఈ కేసును ఎన్‌ఐఏకి అప్పగించడంపై కేంద్ర, రాష్ట్రాలను హైకోర్టు గతంలోనే అడిగి తెలుసుకుంది. ఈ కేసును ఎన్‌ఐఏకి అప్పగించడంపై కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే, తామే తీసుకుంటామని హైకోర్టు తేల్చిచెప్పడంతో కేంద్రం దిగొచ్చి ఎన్‌ఐఏ విచారణకు అంగీకరించింది. పిటిషనర్‌ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు కేసును ఎన్‌ఐఏకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.