సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 ఆగస్టు 2023 (10:04 IST)

ఎమ్మెల్యేల మొత్తం ఆస్తుల విలువ రూ.54,545 - వైకాపా ఎమ్మెల్యే సగటు ఆస్తి రూ.23.14 కోట్లు

cash notes
దేశంలోని ఎమ్మెల్యే ఆస్తుల లెక్క తేలింది. 28 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 4,033 మంది ఎమ్మెల్యేల్లో 4,001 మంది ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లను పరిశీలించిన అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్ (ఏడీఆర్)-నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎస్ఈడబ్ల్యూ) వివరాలను వెల్లడించింది. ఎమ్మెల్యేల మొత్తం ఆస్తుల విలువను రూ.54,545 కోట్లుగా తేల్చింది. 1356 మంది బీజేపీ ఎమ్మెల్యేల ఆస్తులు రూ.16,234 కోట్లు, 719 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆస్తులను రూ.15,798 కోట్లుగా లెక్క తేల్చింది.
 
ఏపీలోని 146 మంది వైసీపీ ఎమ్మెల్యేల ఆస్తులు రూ.3,379 కోట్లు, తెలంగాణకు చెందిన 103 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆస్తులను రూ.1,443 కోట్లుగా పేర్కొంది. 19 మంది టీడీపీ ఎమ్మెల్యేల ఆస్తి రూ.1,311 కోట్లు. బీజేపీ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.11.97 కోట్లు కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.21.97 కోట్లు, వైసీపీ ఎమ్మెల్యే సగటు ఆస్తి రూ.23.14 కోట్లుగా పేర్కొంది.
 
కర్ణాటకలో 223 మంది ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ.14,359 కోట్లు కాగా, తెలంగాణలోని 118 మంది ఎమ్మెల్యేల మొత్తం ఆస్తుల విలువ రూ.1,601 కోట్లు. అంతేకాదు, ఎమ్మెల్యేల ఆస్తుల విలువ నాగాలాండ్, మిజోరం, సిక్కిం బడ్జెట్‌కు మించి ఉందని ఏడీఆర్ -ఎన్‌ఈడబ్ల్యూ పేర్కొంది. అందరికంటే తక్కువగా త్రిపురలో 59 మంది ఎమ్మెల్యేల ఆస్తులు రూ.90 కోట్లుగా తేలింది. రాష్ట్రాల వారీగా చూసుకుంటే మాత్రం కర్ణాటక ఎమ్మెల్యేలు మొదటి స్థానంలో ఉండగా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ ఎనిమిదో స్థానంలో ఉంది.