వర్క్ ఫ్రమ్ హోంతో సోమరిపోతులయ్యారు, మీతో నాకు నో యూజ్ అంటూ 900 మంది ఉద్యోగాలను పీకేసిన బాస్
కరోనా మహమ్మారి ఎంతోమంది జీవితాలతో ఆడుకుంటోంది. కరోనా కాలంలో ఎందరో ఉద్యోగాలు ఊడిపోయాయి. మరోవైపు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. నేను చేయకపోతేనేం వాడు చేస్తాడులే అని అనుకుంటూ పని చేయాల్సిన సమయంలో ఇంట్లో పిల్లాపాపలతో ఎంజాయ్ చేయడం పెరిగింది.
వెనుకటికి ఓ సామెత చెప్పినట్లు ఈ పాలలో నేను గ్లాసు నీళ్లు పోస్తే ఏమవుతుందిలే అని అందరూ పోసారట. చివరికి అవి అన్నీ పాలకు బదులు నీళ్లలా మారిపోయాయి. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ పరిస్థితి కూడా కొందరి వల్ల మిగిలిన ఉద్యోగులు ఉద్యోగాలకు ఎసరపెడుతోంది. ఇప్పుడు అలాంటి ఘటనే జరిగింది.
న్యూయార్క్ ఆధారిత తనఖా రుణదాత కంపెనీ, బుధవారం నాడు యునైటెడ్ స్టేట్స్, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో వారి తొలగింపు గురించి ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ఉద్యోగులను తొలగించింది. హాలిడే సీజన్ ప్రారంభమయ్యే ముందు జూమ్ కాల్‌లో 900 మంది ఉద్యోగులను తొలగించారు. జస్ట్ జూమ్ కాల్‌లో వచ్చిన కంపెనీ సీఈఓ మూడంటే మూడు నిమిషాలు మాట్లాడి మీ అందరినీ తొలగిస్తున్నాను అని చెప్పారు.
ఆ జూమ్ కాల్‌లో ఆయన మాట్లాడుతూ... “కంపెనీలో చేరినందుకు ధన్యవాదాలు. నేను మీ దగ్గరకు వస్తున్నది గొప్ప వార్తతో కాదు. ఇపుడు మార్కెట్ మారిపోయింది. కానీ మీకు అది పట్టడంలేదు. మీరు మార్కెట్ అనుసరించి నడవకపోయినా మేము దానితో నడవక తప్పదు, అలా మేము అభివృద్ధి చెందడం, మా మిషన్‌ను కొనసాగించగలం” అని గార్గ్ వైరల్ వీడియోలో ప్రారంభించారు.
"మార్కెట్, సామర్థ్యం, పనితీరు, ఉత్పాదకత వంటి అనేక కారణాల వల్ల మేము కంపెనీలో 15 శాతం మందిని తొలగిస్తున్నాము" అని ఆయన చెప్పారు. బెటర్ డాట్ కామ్ బాస్ తరువాత 15 శాతం ఫిగర్‌ని సరిదిద్దారు, అసలు సంఖ్య 9 శాతానికి దగ్గరగా ఉందని చెప్పారు. “మీరు ఈ కాల్‌లో ఉన్నట్లయితే, మీరు తొలగించబడిన దురదృష్టకర ఉద్యోగుల్లో వున్నవారై వుంటారు. మీ ఉద్యోగం తక్షణమే రద్దు చేయబడుతుంది.
ఉద్యోగం నుంచి తొలగించబడిన వారికి నాలుగు వారాల్లో టెర్మినేషన్ లెటర్ అందుతుంది. ఒక నెల పూర్తి ప్రయోజనాలు అందిస్తాం. రెండు నెలల కవర్-అప్ కంపెనీ ద్వారా చెల్లించబడుతుందని గార్గ్ చెప్పారు. "మీరు సోమరిపోతులుగా మారారు, ఉత్పాదకత లేదు. పని మీద ధ్యాస లేదు" అంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చేస్తున్న ఉద్యోగులపై విరుచుకుపడ్డారు గార్గ్. "తొలగించబడిన వారిలో కనీసం 250 మంది పే-రోల్ సిస్టమ్‌లో రోజుకు 8 గంటలు+ రోజుకు సగటున 2 గంటలు పనిచేస్తున్నారని మీకు తెలుసా?" అని అడిగారు.
ఇలా ఉద్యోగులను తొలగించడం గార్గ్‌కి కొత్త కాదు. 2016లో కూడా ఇలానే చేసారు. గతంలో, గార్గ్ ఒక ఇ-మెయిల్‌లో తన ఉద్యోగులను "మూగ డాల్ఫిన్‌లు" అని సంబోధిస్తూ... ఇక్కడితో ఆగిపోండి అంటూ, మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారని వారిని ఉద్యోగాల నుంచి తీసేసారు.
బెటర్ డాట్ కామ్ ప్రారంభం నుండి ఇప్పటివరకూ 400 మిలియన్ డాలర్లకు పైగా ఈక్విటీ మూలధనాన్ని సేకరించింది. 2021, 2020కి లింక్డ్‌ఇన్ టాప్ స్టార్టప్‌ల జాబితాలోనూ, అలాగే న్యూయార్క్‌లోని ఫార్చ్యూన్ ఉత్తమ చిన్న-మధ్యస్థ వర్క్‌ప్లేస్‌లలో 1వ స్థానాన్ని సాధించింది.