గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 జూన్ 2022 (07:54 IST)

దేశ వ్యాప్తంగా "అగ్నివీరుల సెగలు" - నేడు భారత్ బంద్ పిలుపు

rail rocco
సైనిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరుద్యోగ యువత చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు తీవ్ర స్థాయికి చేరాయి. తొలుత బీహార్‌లో ప్రాంభమైన ఈ నిరసనలు ఇపుడు దేశంలోని అనేక రాష్ట్రాలకు వ్యాపించాయి. వీటిలో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అయితే, కేంద్రం మాత్రం ఈ అగ్నిపథ్ పథకంపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. పైగా, అమెరికా, చైనా వంటి అగ్రదేశాల్లో ఈ తరహాలోనే సైన్యంలోకి యువతను రిక్రూట్మెంట్ చేస్తుందని వివరణ ఇచ్చింది. 
 
ఇదిలావుంటే, సైనిక ఉద్యోగాల్లో చేరాలని ఏళ్ళ తరబడి శిక్షణ తీసుకుంటున్న నిరుద్యోగులు ఇపుడు అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సోమవారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. అగ్నిపథ్ స్కీమ్‌ను వెంటనే కేంద్రం వెనక్కి తీసుకుని, ఆర్మీలో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీని చేపట్టాలని డిమాండ్ చేశారు. 
 
అయితే, ఈ బంద్‌కు అనుమతి లేదని కేంద్రంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. బంద్ పేరిట నిరసన కార్యక్రమాలు చేపడితో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్‌లలో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించిన విషంయ తెల్సిందే. రైళ్లను తగలబెట్టడంతో పాటు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన నేపథ్యంలో సోమవారం తలపెట్టిన బంద్‌ను భద్రతా బలగాలు ఓ సవాల్‌గా తీసుకున్నాయి. 
 
ఈ మేరకు దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్‌లలో హైఅలెర్ట్ ప్రకటించారు. భారత్ బంద్ పిలుపు నేపథ్యంలో జార్ఖండ్ రాష్ట్రంలో అన్ని పాఠశాలలు, కాలేజీలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బీహార్‌లో ప్రభుత్వ హైఅలెర్ట్ ప్రకటించింది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారు.