సాక్ష్యాలను ధ్వంసం చేయొద్దు... ప్లీజ్ : అజిత్ ధోవల్
ఉగ్రవాద దుశ్చర్యలకు సంబంధించి సేకరించే సాక్ష్యాలను ధ్వంసం చేయొద్దని, వాటిని భద్రంగా ఉంచాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కోరారు. సోమవారం ఢిల్లీలో జాతీయ పరిశోధనా సంస్థ (ఎన్.ఐ.ఏ) ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ధోవల్ ప్రసంగించారు.
ఇందులో ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదులకు పాకిస్థాన్ బాహాటంగా అందిస్తున్న అన్ని రకాల సహాయంపై భారత భద్రత సంస్థలు సాక్ష్యాలు సేకరించి వాటిని అంతర్జాతీయంగా బహిర్గతం చేయాలని కోరారు. ముఖ్యంగా, పొరుగుదేశమైన పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేయడమేకాక, వారికి ఆయుధాలను సమకూర్చడమే ఎజెండాగా తన విధానాన్ని కొనసాగిస్తోందన్నారు.
'పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రేరిపిస్తోంది. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ఏటీఎస్, ఎస్టీఎఫ్, ఎన్.ఐ.ఏ వంచి సంస్థలు పాక్ ఉగ్ర కార్యకలాపాలపై సాక్ష్యాలను సేకరించగలరు. మనకు నిజాలు, సాక్ష్యాలు కావాలి. దొరికిన సాక్ష్యాలను నిర్మూలించవద్దు. వాటిని ఉపయోగించుకోవాలి. వాటిని మీడియాకు ఇవ్వాలి. ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగాలి' అని అజిత్ ధోవల్ పిలుపునిచ్చారు.
పైపెచ్చు.. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం మనకు కొత్తకాదన్నారు. ఉగ్రవాదంతో పోరాటం అన్న విషయం సుస్పష్టమే. గత 30 ఏళ్లుగా దాన్ని చూస్తున్నాం. ఉగ్రవాదులను హతమార్చడంతో అది సమసిపోదు. దాని మూలాలను వెతికి ఏరిపారేయాలి. ఇందుకు మూడు లక్ష్యాలుగా ముందుకు సాగాలి. ఇందులో అసలు ఉగ్రవాదులు ఎవరు? వారు తమకు కావాల్సిన నిధులు, ఆయుధాలు ఎక్కడి నుంచి పొందుతున్నారు? ఏయే దేశాలు వారికి మద్దతును అందిస్తున్నాయి? అనే విషయాలను వెలికితీయాలి.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సేకరించిన సాక్ష్యాలను అంతర్జాతీయ కోర్టులముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. ఇది ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కీలక దశ. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో 'రీసెర్చ్ అండ్ అనాలిస్ వింగ్, ఇంటెలిజెన్స్ బ్యూరో, జమ్మూకశ్మీర్ ప్రభుత్వాలు తమ వంతు కృషిని చేశాయి. కాని ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో రాష్ట్ర పోలీసులదే ప్రథమ పాత్ర' అని ధోవల్ వ్యాఖ్యానించారు.