ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ప్రీతి
Last Updated : మంగళవారం, 25 జూన్ 2019 (15:02 IST)

చెన్నైలో నీటి కొరతకు టాలీవుడ్ హీరో సాయం..

గత కొంత కాలంగా చెన్నై నగరంలో నీటి కొరత ఎక్కువైన విషయం తెలిసిందే. అనేక ప్రాంతాలలో తాగునీరు లేకుండా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పలు రకాలుగా సహాయం అందుతున్నప్పటికీ ఈ సమస్య ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో తమ వంతు సహాయంగా టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రంగంలోకి దిగి పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నారు.
 
సాధారణంగా సామాజిక సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినప్పుడు సహాయసహకారాలు అందించేందుకు సినీ నటుడు, వైఎస్‌ఆర్సీపీ నేత మంచు మోహన్‌బాబు కుటుంబం ఎప్పుడూ ముందుంటుంది. ఇంకా చెప్పాలంటే మంచు మనోజ్‌ వ్యక్తిగతంగా సహాయక చర్యలు చేపడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇంతకు ముందు హుదూద్‌ తుఫాను, చెన్నై వరదల సమయంలో కూడా సత్వరమే స్పందించిన మనోజ్ ఇప్పుడు చెన్నైలో నీటి ఎద్దడి సమస్యపై స్పందించారు.
 
చెన్నైలోని పలు ప్రాంతాలకు తన సన్నిహితులు, స్నేహితులు, అభిమానులతో కలిసి తాగునీటిని అందిస్తున్న మనోజ్.. ‘తెలుగు ప్రజలకు అవసరమైనప్పుడు చెన్నై సహాయం అందించింది. ఇప్పుడు మన వంతు వచ్చింది. దేశంలోనే ఆరవ అతి పెద్ద నగరంలో ఇప్పుడు కనీస అవసరాలకు కూడా నీరు లేక జనాలు ఇబ్బందిపడుతున్నారు. నా వంతు సాయం చేస్తున్నాను. మీరు కూడా చేయండి’ అంటూ ట్వీట్ చేశాడు టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌.