1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: గురువారం, 27 మే 2021 (20:37 IST)

హనుమంతుడి జన్మస్థలంపై రాజుకున్న వివాదం, చర్చ నుంచి బయటకు వచ్చేసిన గోవిందానందస్వామి

హనుమంతుడి జన్మస్థలంపై వివాదం కొనసాగుతోంది. కర్ణాటక రాష్ట్రం పంపా నదిలోని కిష్కింధలోనే ఆంజనేయుడు పుట్టారని పురాణాలు చెబుతున్నాయి. దీన్నీ అందరూ నమ్ముతున్నారు. కానీ టిటిడి ఉన్నట్లుండి గత శ్రీరామనవమి రోజు ఆంజనేయుడు పుట్టింది తిరుమలలోని అంజనాద్రి అంటూ ప్రకటన చేసింది. ఇది కాస్త పెద్ద వివాదానికి కారణమైంది.
 
హనుమత్ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ వ్యవస్థాపకులు గోవిందానందసరస్వతి తిరుపతికి వచ్చారు. టిటిడిలోని కొంతమంది సభ్యులతో కలిసి ఆయన చర్చించారు. అంజనీదేవి తిరుమలలో ఉన్న సమయంలో ఆంజనేయుడికి జన్మనిచ్చిందంటూ టిటిడి ఆధారాలు చూపించింది.
 
అంతేకాదు 18 గ్రంథాలను గోవిందానందసరస్వతి ముందు ఉంచింది. అయితే టిటిడి చూపుతున్న ఆధారాలన్నీ అవాస్తవాలేనన్నారు గోవిందానందసరస్వతి. ఆంజనేయుడు పుట్టింది కిష్కింధ అని ఖచ్చితంగా చెబుతున్నా ఎందుకు టిటిడి కమిటీ సభ్యులు పట్టించుకోవడం లేదంటూ చర్చ మధ్య నుంచి బయటకు వచ్చేశారు స్వామీజీ. 
 
సంస్కృత విద్యాపీఠంలో జరిగిన చర్చకు సంబంధించిన విషయాలను మీడియాతో ఆయన పంచుకున్నారు. ఆంజనేయస్వామి జన్మస్థలంపై స్పష్టత ఇస్తున్నా టిటిడి ఒప్పుకోవడం లేదన్నారు. అంజనాద్రి పేరు కృతయుగానికి సంబంధించిందని.. హనుమంతుడి జన్మస్థలం కిష్కిందేనన్నారు.
 
సంపూర్ణ పురాణాన్ని టిటిడి సభ్యుల దృష్టికి తీసుకెళ్ళానని.. అసలు హనుమంతుడి జన్మతిథిపై టిటిడి ఎక్కడా స్పష్టంగా చెప్పలేదన్నారు. టిటిడి చూపిస్తున్న ఆధారాలన్నీ అవాస్తవాలేననన్నారు. తనతో చర్చించిన కమిటీలోని సభ్యులకు ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. 
 
పెద్దజియ్యంగార్ స్వామిని చర్చకు ఎందుకు పిలువలేదని ప్రశ్నించారు. పురాణాలు పరమప్రమాణం అన్న విషయాన్ని టిటిడి గుర్తించుకోవాలని.. టిటిడి వారు హనుమంతుడి వివాహం చేసినట్లుగా ఒప్పుకుంటారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. బహిరంగ చర్చ పెట్టకుండా అంతర్గత చర్చ పెట్టడమేంటన్నారు. దీంతో వివాదం మరింత రాజుకుంటోంది.