సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 జులై 2022 (09:28 IST)

'రాష్ట్రపతి'కి కల్పించే ప్రయోజనాలేంటి? ఎలాంటి వాహనంలో ప్రయాణిస్తారు?

president
దేశ రాష్ట్రపతి పీఠాన్ని సాదాసీదాగా ఉండే గిరిజన తెగకు చెందిన ద్రౌపదీ ముర్ము అధిరోపించనున్నారు. తన రాజకీయ జీవితంలో కౌన్సిలర్ నుంచి ఒక రాష్ట్ర గవర్నర్‌గా ఎన్నో పదవులు అలంకరించినప్పటికీ ఆమె మాత్రం ఎల్లవేళలా నిరాడంబర జీవితాన్నే గడిపారు. ఇపుడు రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో ఆమె ఎలాంటి జీవితం గడుపనున్నారు? ఎంత వేతనం అందుకోబోతున్నారు.? ఎలాంటి వాహనంలో ప్రయాణించబోతున్నారు? ఆమె పదవీ విరమణ తర్వాత పొందే ప్రయోజనాలేంటి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 
 
దేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముర్ము అధికారిక నివాసం రాష్ట్రపతి భవన్ అవుతుంది. దీన్ని 1929లో నిర్మించారు. ఆంగ్లేయుల పాలన ఉన్నపుడు ఈ భవనాన్ని వైస్రాయ్ నివాసంగా ఉపయోగించారు. ఇందులో 340 గదలు ఉంటాయి. రాష్ట్రపతి నివాసం, అతిథులు గదులు, ఇతర కార్యాలయాలన్నీ ఇందులో ఉన్నాయి. సిమ్లాలోని రిట్రీట్ భవనం, హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని రాష్ట్రపతి విడిది కేంద్రాలుగా ఉపయోగిస్తారు. 
 
ఇకపోతే, కొత్త రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ద్రౌపదీ ముర్ముకు నెలకు రూ.5 లక్షలు వేతనంగా లభిస్తుంది. దేశంలో అత్యధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగి రాష్ట్రపతే కావడం గమనార్హం. 
 
రాష్ట్రపతి ప్రయాణించే వాహనం అన్ని వ్యవస్థలు ఉన్న బుల్లెట్ ప్రూఫ్ కారులో ప్రయాణిస్తారు. ఈ కారుకు లైసెన్స్ ప్లేటు ఉండదు. ప్రస్తుతం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మెర్సిడెజ్ మేబాక్ ఎస్600 పుల్‌మాన్ గార్డ్ మోడల్‌ కారును ఉపయోగిస్తున్నరు. అది తుపాకీ తూటాలతో పాటు పేలుళ్లు, విష వాయువుల దాడులను కూడా సమర్థంగా ఎదుర్కొంటుంది. 
 
రాష్ట్రపతికి త్రివిధ దళాల నుంచి ప్రత్యేకంగా ఎంపిక చేసిన సైనికులకో నిరంతరం భద్రత కల్పిస్తారు. రాష్ట్రపతి బాడీగార్డు యూనిట్‌గా వారిని పేర్కొంటారు. 
 
రాష్ట్రపతి పదవీకాలం ముగిసిన తర్వాత నెలకు కనీసం రూ.1.50 లక్షల పింఛను వస్తుంది. వారి జీవిత భాగస్వామికి నెలకు రూ.30 వేలు ఇస్తారు. పదవీ విరమణ చేసిన తర్వాత  ప్రత్యేక బంగ్లాలో నివాసం ఉండొచ్చు. ఇందుకోసం అద్దె కూడా చెల్లించనక్కర్లేదు. ఐదుగురు వరకు సహోద్యోగులను నియమించుకోవచ్చు. ఇలాటి సౌకర్యాలను రాష్ట్రపతి పొందుతారు.