గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శనివారం, 28 జులై 2018 (08:52 IST)

విషమించిన కరుణ ఆరోగ్యం.. ఆస్పత్రికి తరలింపు.. స్టాలిన్ కంట కన్నీరు...

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం విషమించింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి, చిన్న కుమారుడు ఎంకే స్టాలిన్, కేంద్ర మాజీ మంత్రులు, ఇతర పార్టీల నేతల

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం విషమించింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి, చిన్న కుమారుడు ఎంకే స్టాలిన్, కేంద్ర మాజీ మంత్రులు, ఇతర పార్టీల నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కరుణానిధి నివాసానికి చేరుకున్నారు.
 
శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఒక్కసారిగా కరుణానిధికి రక్తపోటు పడిపోయింది. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆళ్వార్‌పేటలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. అక్కడ క్రిటికల్ కేర్ విభాగంలో ఉంచి ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. అనంతరం హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు కరుణానిధి బీపీ లెవల్స్ తగ్గినట్టు తెలియజేశారు.
 
కరుణానిధికి బీపీ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోవడంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని, ఐసీయూలో ఉంచి చికిత్స అందించడంతో తిరిగి సాధారణ స్థాయికి వచ్చినట్టు కావేరీ ఆస్పత్రి యాజమాన్యం విడుదల చేసిన వైద్య బులిటెన్‌లో పేర్కొంది. 
 
మరోవైపు, కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై అటు కార్యకర్తలు ఇటు నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారమే పార్టీ అధ్యక్షుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆయన... ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారన్న వార్తలను తట్టుకోలేకపోతున్నారు. దీనికితోడు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.