బెంగాల్ దంగల్ : మమతా బెనర్జీ ఓటమి ఖాయం
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఈ ఎన్నికల్లో అధికార టీఎంకీ, బీజేపీలు నువ్వానేనా అన్నట్టుగా తలపడ్డాయి. ఈ క్రమంలో మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగనుంది. అయితే, ప్రస్తుతం వెల్లడవుతున్న ఎన్నికల ఫలితాల్లో బెంగాల్‌లో మళ్లీ మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ అధికారంలోకి వస్తుందని వెల్లడిస్తున్నాయి. అయితే, నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓడిపోబోతున్నారని ఇండియా టీవీ, పీపుల్స్‌పల్స్ ఎగ్జిట్ పోల్‌లో వెల్లడించింది.
ఈ నియోజకవర్గం నుంచి స్థానికుడైన బీజేపీ అభ్యర్ధిగా తలపడిన సుబేందు అధికారి గెలవబోతున్నారని అంచనా వేసింది. అంతేకాదు పశ్చిమబెంగాల్‌లో 292 స్థానాలకుగాను బీజేపీ 183 స్థానాల్లో విజయం సాధించబోతోందని తెలిపింది. అధికార తృణమూల్ పార్టీ 76 స్థానాలకే పరిమితం కాబోతోందని అంచనా వేసింది.
వాస్తవానికి 2016లో తృణమూల్‌కు 211 స్థానాల్లో విజయం అందించిన బెంగాలీ ఓటర్లు ఈసారి బీజేపీకి అండగా నిలిచారని ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్‌లో వెల్లడించింది. దీదీ వర్సెస్ మోడీగా మారిన ప్రస్తుత పోరులో నందిగ్రాం నియోజకవర్గంతో పాటు పశ్చిమబెంగాల్‌లో చాలాచోట్ల కాషాయజెండాకు అనుకూలంగా బలమైన పవనాలు వీస్తున్నాయని తెలిపింది.
అలాగే, తమిళనాడు రాష్ట్రంలో ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే అధికారంలోకిరానుంది. కేరళ రాష్ట్రంలో లెఫ్ట్ పార్టీ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంటుందనీ, అస్సాంలో బీజేపీ, పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ - బీజేపీ సారథ్యంలోని కూటమి విజయం సాధిస్తాయని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి.