గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Modified: బుధవారం, 5 మే 2021 (21:00 IST)

ఆలస్యం చేస్తే మనకు కూడా అమెరికా గతే: కుండ బ‌ద్ధ‌లు కొట్టిన గులేరియా

క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో ఎయిమ్స్ డైరెక్ట‌ర్ ర‌ణ్‌దీప్ గులేరియా కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. దేశంలో ప్రస్తుత కట్టడి చర్యలు కరోనాను ఏమాత్రం నియంత్రించలేవని తేల్చి చెప్పారు. రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతపు లాక్‌ డౌన్‌‌తో ఎలాంటి ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు. ఇలాగే కొనసాగితే కరోనా మూడో వేవ్‌ వచ్చే అవకాశం ఉందని కూడా హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.

కరోనాను అడ్డుకోవాలంటే సంపూర్ణ లాక్‌ డౌనే ఏకైక పరిష్కార మార్గ‌మ‌ని కూడా సూచించారు. దేశంలో క‌రోనా నియంత్ర‌ణ‌కు మూడు మార్గాల‌ను అనుస‌రించాల‌ని సూచించారు. ముందుగా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల క‌ల్ప‌న‌పై దృష్టి పెట్టాలి. 3వ వేవ్‌ కట్టడికి వ్యాక్సిన్లు వేగం పెంచడం, ప్రజలు భౌతిక దూరం పాటించాలని, గుంపులుగా తిరగొద్దని పేర్కొన్నారు.
 
ఈ చర్యలు తీసుకుంటే కేసులు తగ్గేందుకు ఆస్కారం ఉందని తెలిపారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా లాక్‌ డౌన్‌ లాంటి చర్యలు తీసుకోవాలని, ఆలస్యం చేస్తే అమెరికా పరిస్థితే మనకూ వస్తుందని, లాక్‌డౌన్‌ లాంటి నిర్ణయం తీసుకుంటూనే ప్రజలకు నిత్యావసరాలతో పాటు రోజువారీ కార్మికుల గురించి కూడా ఆలోచన చేయాలని పేర్కొన్నారు.

మ‌రోవైపు దేశంలోని 12 రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి అత్య‌ధిక స్థాయిలో ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివ‌రాల ప్రకారం దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల‌లో 81 శాతం ఈ 12 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. మహారాష్ట్రలో క‌రోనా పరిస్థితులు కాస్త‌ మెరుగుపడుతున్నప్పటికీ, ఇప్ప‌ట్లో కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గేలా క‌నిపించడం లేదు.
 
కొన్ని రోజుల క్రితం వ‌ర‌కూ మహారాష్ట్రలో రోజుకు కొత్త‌గా 60 వేలకు పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. సోమ‌వారం కొత్త‌గా 56 వేలకు పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అయితే మంగళవారం కేసుల సంఖ్య కాస్త త‌గ్గి, కొత్త‌గా 48,621 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మహారాష్ట్రతో పాటు కర్ణాటకలో 44,438, ఉత్తరప్రదేశ్‌లో 29,052 కేసులు కొత్త‌గా నమోదయ్యాయి.

దేశంలో ప్ర‌స్తుతం 34,47,133 కరోనా బాధితులు ఉన్నారని, వారు ఆసుప‌త్రులు లేదా ఇళ్ల వ‌ద్ద చికిత్స పొందుతున్నార‌ని ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. క‌రోనా సోకిన మొత్తం బాధితుల‌లో ఇది 17 శాతం. కరోనా డెత్ రేటు 1.10 శాతంగా ఉంది.