సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2019 (16:36 IST)

ఇండో - పాక్ దేశాల మధ్య అణు యుద్ధం జరిగితే... నష్టమెంత... లాభమెంత?

భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా, కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్థాన్ పగతో రగిలిపోతోంది. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలన్న పగతో ఉంది. ఇందులోభాగంగా, భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులను భారత్‌లోకి పంపుతూ, విధ్వంసం సృష్టించాలని పుసిగొల్పుతోంది. అదేసమయంలో ఇరు దేశాల నేతల నోటి వెంట కూడా అణు యుద్ధం మాటలు పదేపదే వినిపిస్తున్నాయి. అయితే, ఈ మాటలు నిజమై ఒకవేళ ఇరు దేశాల మధ్య అణు యుద్ధమంటూ జరిగితే జరిగే పరిణామాలపై అమెరికాకి చెందిన ఓ యూనివర్సిటీ సంచలన అధ్యయనం వెలువరించింది. 
 
ఇరు దేశాల మధ్య అణు యుద్ధమంటూ జరిగితే భారత్ - పాకిస్థాన్ దేశాల్లోనే కాదు.. అంతర్జాతీయంగా తీవ్ర దుర్భిక్షం నెలకొంటుందని వెల్లడించింది. ఈ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పది కోట్ల మంది మృతి చెందే అవకాశం ఉందని తెలిపింది. 
 
మరోవైపు, ఇండో పాక్ దేశాల మధ్య 2025 సంవత్సరం లోపు యుద్ధం జరగొచ్చని తెలిపారు. యుద్ధానంతర పరిస్థితులపై న్యూ బ్రూన్స్‌విక్‌లోని రాట్కెర్స్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. సైన్స్ ఎడ్వాన్సెస్‌ అనే పత్రికలో ఇది ప్రచురితమైంది. 
 
ఈ పరిణామాలపై రాట్కెర్స్ యూనివర్సిటీ పరిశోధకుడు అలన్ రోబక్ స్పందిస్తూ, 'అలాంటి యుద్ధం అంటూ జరిగితే.. కేవలం బాంబులు విడిచిన చోట మాత్రమే కాదు.. మొత్తం ప్రపంచానికే ప్రమాదం' అంటూ హెచ్చరించారు. 
 
ఈ యుద్ధంలో అణ్వాయుధాలు ప్రయోగించడం వల్ల 16 నుంచి 36 మిలియన్ల టన్నుల మసి విడుదలవుతుందనీ.. ఇది ఎగువ వాతావరణంలోకి చేరుకుని కొద్ది వారాలకే ప్రపంచం మొత్తం విస్తరిస్తుందని రాట్కెర్స్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. గాలిలోని వేడిని, సూర్య రశ్మిని పీల్చుకునే ఈ మసి కణాల వల్ల వాతావరణం మరింత తీవ్రంగా కలుషితమవుతుందని వివరించారు.
 
అంతేకాదు భూమికి చేరుకోవాల్సిన సూర్యకిరణాలు 20 నుంచి 30 శాతం తగ్గుతాయనీ, దీని వల్ల భూ ఉపరితలం 2 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మేర చల్లబడుతుందని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా వర్షపాతం 15 నుంచి 30 శాతం తగ్గుతుందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా కూరగాయల ఉత్పత్తి 15 నుంచి 30 శాతానికి పడిపోతుందని చెప్పారు. సముద్రాల్లోనూ 5 నుంచి 15 శాతం వరకు ఉత్పత్తి క్షీణిస్తుందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు.