మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Updated : సోమవారం, 27 జులై 2020 (20:22 IST)

చిత్తూరు జిల్లా రైతు అసలు స్థితి అది కాదా? సోనూసూద్‌ తెలుసుకోలేకపోయారా? ఎలాగో చెప్పిన అధికారులు

కరోనావైరస్ కాలంలో పంటలు పండించడానికి కనీసం ఎద్దులు లేకుండా ఇద్దరు కూతుళ్ళను కాడికి కట్టి పొలం దున్నాడు నాగేశ్వర రావు అనే రైతు. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారి సినీనటుడు సోనూసూద్ స్పందించాడు. ట్విట్టర్ వేదికగా స్పందించిన సోనూసూద్ రైతు ఇంటికి రెండు ఎద్దులను పంపుతానన్నాడు. కానీ ఆ తరువాత ఏకంగా ట్రాక్టర్‌నే కొని పంపించాడు. 
 
ఇది నిజంగా సోనూసూద్ గొప్ప వ్యక్తి అని చెప్పడానికి ప్రధాన ఉదాహరణ. కరోనా ప్రారంభంలోనే వలస కార్మికులు ఇబ్బందులు పడుతుంటే సొంత డబ్బులతో వారిని గమ్యస్థానాలకు చేర్చాడు. సోనూసూద్ గ్రేట్ అంటూ నిరూపించుకున్నాడు. ఆ తరువాత చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలోని కె.వి.పల్లి గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే రైతు తన పొలం దున్నడంలో కన్నకూతుళ్ళను రెండు కాడి ఎద్దుల స్థానంలో నిలబెట్టాడు.
 
వాటిని లాగుతుండగా వీడియో తీసి పెట్టారు. ఇది కాస్త పెద్ద చర్చకు దారితీసింది. ట్విట్టర్లో ఈ వీడియోను చూసిన సోనూసూద్ చలించిపోయాడు. నిన్న ట్విట్టర్లో రైతు నాగేశ్వరరావు కుటుంబానికి రెండు ఎద్దులను వెంటనే పంపిస్తానన్నాడు. కానీ ఎద్దుల కన్నా ఆ రైతుకు ట్రాక్టర్ ముఖ్యమని భావించి లక్షలతో కొని పంపాడు. 
 
అయితే దీన్ని తీసుకున్న రైతు నాగేశ్వరరావు అసలు స్వరూపం అది కాదంటూ చెప్పుకొచ్చారు రెవిన్యూ అధికారులు. ప్రభుత్వ పథకాలు తన దరిచేరడం లేదని.. తన కుమార్తెలు చదువుకోలేని స్థితిలో ఉన్నారని.. కడు పేదరికంతో తాము కొట్టుమిట్టాడుతున్నామని నాగేశ్వరరావు చెప్పాడు. కానీ అదంతా అబద్ధమని రెవిన్యూ అధికారులు తేల్చేశారు. 
 
నాగేశ్వరరావు ఆర్థికంగా నిలదొక్కుకున్న వ్యక్తే అని నిర్థారించారు. అంతేకాదు ప్రభుత్వ పథకాలన్నింటినీ రైతు నాగేశ్వరరావు ఉపయోగించుకున్నాడు. గత యేడాది రైతు భరోసా కింద 13,500 రూపాయలు నేరుగా నాగేశ్వరరావు ఖాతాలో వేసిందట ప్రభుత్వం. అలాగే ఈ ఏడాది రైతు భరోసాలో భాగంగా ఇప్పటివరకు 7,500 రూపాయలు బదిలీ అయ్యిందట. 
 
నాగేశ్వరరావు చిన్న కూతురుకు జగనన్న అమ్మ ఒడి కింద గత జనవరిలో 15 వేల రూపాయలు ప్రభుత్వం అందించింది. పెద్ద కూతురు జగనన్న తోడు కింద లబ్ధి కోసం ధరఖాస్తు చేసుకుంది. చిరు వ్యాపారుల కోసం ప్రభుత్వం వడ్డీలేని ఆర్థిక సహాయం ఈ పథకం కింద అందిస్తున్నారు. నాగేశ్వరరావు తల్లి అభయహస్తం కింద పెన్షన్ అందుకుంటున్నారు. 
 
నాగేశ్వరరావు తండ్రి వృద్ధాప్య పెన్షన్ కింద ప్రతినెలా 2,250 రూపాయలు అందుకుంటున్నారట. కరోనా సమయంలో పేద కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతి కుటుంబానికి అందించిన వెయ్యి రూపాయల సహాయాన్ని నాగేశ్వరరావు కుటుంబం అందుకుందట. ఉచిత రేషన్ తీసుకుంటున్నారట. తనకున్న 2 ఎకరాల పొలంలో వేరుశెనగ వేయడానికి రైతు భరోసా కేంద్రం నుంచి డిఏపీ ఎరువు, విత్తనాలను తీసుకున్నారట.
 
అంతేకాదు ఆర్థికంగా నాగేశ్వరరావు కుటుంబం బాగా నిలదొక్కుకున్న కుటుంబమని రెవిన్యూ అధికారులు నిర్థారించారు. నిన్న మొత్తం హడావిడి జరిగితే ఈరోజు ఉదయం వాళ్ళ ఇంటికి వెళ్ళిన రెవిన్యూ అధికారులు ఈ విషయాన్ని తేల్చారు. నాగేశ్వరరావు కావాలనే కూతుళ్ళ దగ్గర అలా చేయించి వీడియోలు షేర్ చేశాడని స్థానికులే రెవిన్యూ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళారు. మరి ఈ వివరాలు తెలిస్తే సోనూసూద్ ఏమని ఫీలవుతారో?