బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 మే 2020 (22:26 IST)

జయలలిత ఆస్తులకు వారసులు ఎవరు: మద్రాస్ హైకోర్టు తీర్పు ఏంటి?

అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితకు కోటాను కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం జయలలిత పేరుమీద రూ.913 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులకు వారసులు ఎవరన్న అంశంపై పెద్ద చర్చే జరిగింది. ఒకవైపు జయలలిత అన్న పిల్లలు, మరోవైపు జయలలిత ప్రియ నెచ్చెలి శశికళలు వారసలు తామంటే తాము అంటూ పోటీపడ్డారు. కానీ, మద్రాస్ హైకోర్టు మాత్రం కీలక తీర్పును వెలువరించింది. 
 
జయ ఆస్తుల విషయంలో ఆమె మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్‌లను చట్టబద్ధమైన వారసులుగా ప్రకటించింది. చనిపోయేంత వరకు జయ పెళ్లి చేసుకోలేదని... అందువల్ల ఆమెకు దీప, దీపక్ తప్ప మరెవరూ చట్టబద్ధమైన వారసులు లేరని కోర్టు వ్యాఖ్యానించింది. జయలలితకు చెందిన మొత్తం ఆస్తులు వీరిద్దరికే చెందుతాయని చెప్పింది. 
 
మరోవైపు, జయలలిత అధికారిక నివాసమైన పోయస్ గార్డెన్‌లోని వేద నిలయాన్ని జయ స్మారక హౌస్‌గా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి, ఇందుకోసం ఓ ఆర్డినెన్స్‌ను కూడా జారీచేసింది. అయితే, జయలలిత ఆస్తులకు ఎవరు వారసులు అనే అంశంపై అన్నాడీఎంకే నేత పుహళేంది దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 
 
తమ సూచనలపై సమాధానం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి 8 వారాల గడువు ఇచ్చింది. వేద నిలయం విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని... అందువల్ల జయ వారసులకు కూడా దీని విషయంలో నోటీసులు ఇవ్వాలని, వారి వాదనలను కూడా వినాలని చెప్పింది.