మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 26 అక్టోబరు 2019 (16:45 IST)

హర్యానా ఉప ముఖ్యమంత్రిగా దుశ్యంత్ చౌతలా తల్లి?

హర్యానా రాష్ట్రంలో బీజేపీ - జేజేపీ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ఆదివారం రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, ఇరు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు జేజేపీకి ఉప ముఖ్యమంత్రి పదవిని కమలనాథులు ఇవ్వనున్నారు. ఆ పోస్టుకు జేజేపీ చీఫ్ దుశ్యంత్ చౌతలా తల్లి నైనా చౌతలా పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. 
 
ఈ నెల 21వ తేదీన హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడైన విషయం తెల్సిందే. ఈ ఫలితాల్లో 90 సీట్లున్న హర్యానా అసెంబ్లీలో ఏ ఒక్క పార్టీ సంపూర్ణ మెజార్టీ (46) సీట్లుదక్కించుకోలేక పోయింది. ఫలితంగా హంగ్ అసెంబ్లీ ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు కమలనాథులు ఆసక్తి చూపి, జేజేపీ చీఫ్ దుశ్యంత్ చౌతలాతో చర్చలు జరిపారు. 
 
ఈ చర్చలు ఫలించడంతో హర్యానా రాష్ట్రంలో బీజేపీ - జేజేపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. అయితే, ఉప ముఖ్యమంత్రిగా నైనా చౌతాలా(53) పేరును పరిశీలిస్తున్నట్లు శనివారం జన్నాయక్‌ జనతా పార్టీ (జేజేపీ) వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎవరిని డిప్యూటీ సీఎం చేస్తారనేది ఇంకా అధికారికంగా ఖరారు కాలేదని తెలిపారు. 
 
నైనా బాంద్రా నియోజకవర్గం నుంచి పోటీ చేసి 13 వేల పైచిలుకు ఓట్లతో కాంగ్రెస్‌ నేత రణ్‌బీర్‌ సింగ్‌ మహేంద్రను ఓడించారు. టీచర్ల భర్తీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న అజయ్‌ చౌతాలాకు భార్య నైనా చౌతాలా. దబ్వాలి నుంచి ఐఎన్ఎల్డీ ఎమ్మెల్యేగా వ్యవహరించిన నైనా.. 2018లో కుమారుడు దుష్యంత్‌ చౌతాలా(31) స్థాపించిన జన్నాయక్‌ జనతా పార్టీలో  చేరారు.