శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శనివారం, 14 ఏప్రియల్ 2018 (09:06 IST)

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు : బీజేపీకి కావేరీ సెగలు... గుర్రుగా తమిళ తంబీలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 12వ తేదీన జరుగనుంది. 15వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో విజయం కోసం కమలనాథులు అహర్నిశలు కృషిచేస్తున్నారు. ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 12వ తేదీన జరుగనుంది. 15వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో విజయం కోసం కమలనాథులు అహర్నిశలు కృషిచేస్తున్నారు. ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. కానీ, కావేరీ సెగ వారి ప్రయత్నాలను వమ్ము చేసేలా ఉన్నాయి.
 
వివాదాస్పద కావేరీ జలాల పంపిణీ కోసం కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ విషయంలో కేంద్రం తీవ్రజాప్యం చేస్తోంది. దీంతో తమిళనాడు కావేరీ చిచ్చు ప్రారంభమైంది. ఒక్క అధికార అన్నాడీఎంకే, బీజేపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ఏకమయ్యాయి. తక్షణం కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. అంతేనా, రైల్‌రోకోలు, ధర్నాలతో అట్టుడికిపోతోంది. 
 
ఈ ప్రభావం కర్ణాటక ఎన్నికలపై ఎక్కువగా చూపనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కావేరీ నిర్వాహక మండలిని ఏర్పాటు చేయకపోవడంపై కన్నడనాట స్థిరపడిన తమిళులు కమలనాథులపై ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. కర్ణాటకలోని దాదాపు 10 జిల్లాల్లోని 60 నియోజకవర్గాల్లో తమిళ ఓటర్లే కీలకం. ఈ ఎన్నికల్లో వారు తీసుకునే నిర్ణయం బీజేపీ ఆశలను తలకిందలు చేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకుల వాదన. 
 
మరోవైపు, తెలుగు ప్రజలు కూడా బీజేపీ ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మబలికిన కమలనాథులు ఇపుడు మొండిచేయి చూపారు. అంతేనా, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా హాని చేస్తున్నారు. ఇచ్చిన నిధులను వెనక్కి తిరిగి తీసుకుంటున్నారు. కొత్తగా ఒక్క పైసా ఇవ్వడం లేదు. దీంతో తమిళ తంబీల కంటే తెలుగు ప్రజలు మరింత ఆగ్రహంతో ఉన్నారు. 
 
నిజానికి కర్ణాటకలో తెలుగు ప్రజలు అనేక జిల్లాల్లో ఉన్నారు. బెంగుళూరు నగరంతోపాటు బళ్లారి రీజియన్‌లో వీరి ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో అభ్యర్థుల గెలుపోటములను తెలుగు ఓటర్లే శాసిస్తూ వస్తున్నారు. దీంతో ఈ దఫా నమ్మించి గొంతుకోసిన బీజేపీకి తెలుగోడి దెబ్బ చూపించేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. ఇలా ఒకవైపు తమిళ తంబీలు, మరోవైపు తెలుగుప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇది కమలనాథులకు ఏమాత్రం మింగుడుపడని అంశంగా మారింది.