గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: మంగళవారం, 6 ఆగస్టు 2019 (13:40 IST)

కాంగ్రెస్ పార్టీ కూసాలు కదిలిస్తున్న కశ్మీర్... 'హస్తం' నేతలు మోదీకి మద్దతు...

దేశ వ్యాప్తంగా జమ్ముకశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు చేసి సువిశాల భారతావనికి వనగూరే అన్ని సౌకర్యాలను అందించడమే కాకుండా భారతదేశంలోని ఇతర ప్రాంతాల వారు సౌందర్య కశ్మీర్‌లో భూములు కూడా కొనుగోలు చేసుకునే అవకాశాన్ని మోదీ ప్రభుత్వం కల్పించింది. దీనిపై రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ రగడ చేస్తోంది. ఆ పార్టీకి చెందిన ఆజాద్ అయితే కశ్మీర్ పైన అమిత్ షా అణు బాంబు వేశారంటూ వ్యాఖ్యానించారు. 
 
ఐతే కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు మాత్రం తమ పార్టీ తీసుకున్న స్టాండును సమర్థించడంలేదు. కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే అధితీ సింగ్ సొంత పార్టీకి షాకిచ్చారు. కేంద్రం కశ్మీర్ పైన తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఆమె స్పందిస్తూ... దేశ సమైక్యతకు తామంతా కట్టుబడి ఉన్నామని పేర్కొంటూ జై హింద్ అంటూ ట్వీట్ చేశారు.
 
అంతేకాదు ఆమెతో పాటు యూపీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జనార్థన్‌ ద్వివేది సైతం ఎన్డీఏకి మద్దతు తెలిపారు. ఇంకా ఆర్టికల్‌ 370 రద్దుపై కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం వ్యక్తం చేయడాన్ని ఖండిస్తూ రాజ్యసభలో కాంగ్రెస్‌ విప్‌‌గా వున్న భువనేశ్వర్ కలిత తన పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మరి ఈ రాజీనామాలు, తిరుగుబావుటాలు ఎంతవరకు వెళతాయో... మొత్తమ్మీద కశ్మీర్ అంశం కాంగ్రెస్ పార్టీ కూసాలు కదిలించేట్లు వుంది.