శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 2 ఆగస్టు 2018 (16:02 IST)

జనసేన (తెలంగాణ) అధ్యక్షుడిగా మోత్కుపల్లి?

హీరో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీలో చేరేందుకు చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు ఉవ్విళ్ళూరుతున్నారు. ఇందులోభాగంగా, పలువురు నేతలు ఆ పార్టీ అధినేత పవన్‌తో సమావేశమయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు.

హీరో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీలో చేరేందుకు చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు ఉవ్విళ్ళూరుతున్నారు. ఇందులోభాగంగా, పలువురు నేతలు ఆ పార్టీ అధినేత పవన్‌తో సమావేశమయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నేత, టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు పవన్‌తో భేటీ అవుతున్నారు. 
 
ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మోత్కుపల్లి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో, పవన్ - మోత్కుపల్లి భేటీ ఆసక్తికరంగా మారింది. ఒకవేళ జనసేనలో మోత్కుపల్లి చేరితే ఆయనకు ఏ పదవి ఇస్తారనే కోణంలో చర్చ జరుగుతోంది. మరోవైపు, జనసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మోత్కుపల్లిని నియమించే అవకాశాలను కొట్టిపారేయలేమని విశ్లేషకులు చెబుతున్నారు. 
 
తనకు గవర్నర్ పదవి ఇస్తానని చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు.. కేంద్రంతో గొడవలు పెట్టుకుని తన ఆశలను అడియాసలు చేశారంటూ ఇటీవల బహిరంగంగానే మోత్కుపల్లి తీవ్రమైన విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఏపీ హక్కుల కోసం కేంద్రంపై చంద్రబాబు పోరాడుతున్న నేపథ్యంలో ఇక తనకు గవర్నర్ పదవి రాదని తెలుసుకున్న మోత్కుపల్లి.. ఎన్టీఆర్ జయంతి రోజు ఎన్టీఆర్ ఘాట్ వద్దే చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో పార్టీ నుంచి మోత్కుపల్లిని సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ అధిష్టానం ప్రకటించింది. 
 
టీడీపీ నుంచి వైదొలగిన మోత్కుపల్లి.. చంద్రబాబు పతనమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవాలంటూ తిరుమలకు కాలినడకన వెళ్లారు. అంతేకాకుండా వైసీపీతో కలిసి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏపీలో ప్రచారం చేస్తానని కూడా మోత్కుపల్లి ప్రకటించారు. అయితే వైసీపీ-జనసేన మధ్య వివాదం రేగిన తాజా పరిస్థితుల నేపథ్యంలో పవన్ కల్యాణ్‌ను మోత్కుపల్లి కలవడం పలు చర్చలకు ఊతమిస్తోంది.