గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 డిశెంబరు 2019 (14:33 IST)

తలారి లేడట... అందుకే నిర్భయ నిందితులకు ఉరి అమలులో జాప్యం!

దేశంలో కలకలం రేపిన ఘటన నిర్భయ అత్యాచార హత్య కేసు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. న్యూఢిల్లీ వీధుల్లో నడుస్తున్న బస్సులో ఆశాదేవి అనే మహిళ కుమార్తె నిర్భయ (23)ను ఆరుగురు కామాంధులు అతి కిరాతకంగా అత్యాచారం చేశారు. 2012 డిసెంబర్ 16 అర్థరాత్రి నుంచి 17 తెల్లవారుజాము వరకూ ఈ దారుణం జరుగగా, 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన బాధితురాలు కన్నుమూసింది. దేశ యువతలో వెల్లువెత్తిన నిరసనతో చట్టాలు కఠినమయ్యాయి. కొత్తగా నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే, ఈ కేసులో నిందితులకు కోర్టు ఉరిశిక్షలు విధించగా, ఇప్పటివరకు వరకు ఆ శిక్షలు అమలు చేయలేదు. 
 
అయితే, తాజాగా హైదరాబాద్ నగరంలో దిశా అత్యాచార, హత్య కేసు కూడా నిర్భయ కేసు తరహాలోనే జరిగింది. అదేసమయంలో నిర్భయ కేసులో ఇప్పటివరకు శిక్షలు అమలుకాలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నిర్భయ కేసులో దోషులకు వచ్చే నెలలో ఉరి శిక్ష అమలు కానుంది. ఇప్పటివరకూ వారు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్లు ఏవీ ఆమోదానికి నోచుకోలేదు. దీంతో తీహార్ జైలు అధికారులు వీరిని ఉరితీయడానికి సమయం దగ్గర పడిందని అంటున్నారు. 
 
అదేసమయంలో తీహార్ జైల్లో ఉరిని అమలు చేయాల్సిన తలారి లేడట. అది ఓ పెద్ద సమస్యగా మారిందని, జైలు అధికారులు అంటున్నారు. కోర్టు నుంచి దోషుల ఉరితీతకు సంబంధించి, అనుమతులిస్తూ, 'బ్లాక్ వారెంట్' జారీ అయిన తర్వాత ఏ రోజైనా వారిని ఉరి తీయవచ్చని, చివరిగా వారు రాష్ట్రపతికి పెట్టుకునే అర్జీని కొట్టివేస్తే, ఆపై కోర్టు బ్లాక్ వారెంట్‌ను ఇస్తుందని జైలు అధికారి ఒకరు తెలిపారు. జైలులో తలారి ఉద్యోగాన్ని భర్తీ చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులను కోరామని అన్నారు.
 
కాగా, తీహార్ జైల్లో చివరిగా పార్లమెంట్‌పై దాడి చేసిన అఫ్జల్ గురును ఉరి తీసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రాత్రికి రాత్రే జరిగిన పరిణామాలతో తలారిని నియమించకుండానే, జైలు అధికారులు ఉరికంబానికి ఉండే లివర్‌ను లాగి, శిక్షను అమలు చేశారు. ప్రస్తుతం ఇతర ప్రధాన జైళ్లలో ఎవరైనా తలారి ఉన్నారా? అన్న విషయాన్ని విచారిస్తున్నామని, ఎవరైనా దొరికితే, అతన్ని తీహార్‌కు తాత్కాలికంగా బదిలీ చేయించి, శిక్ష అమలుకు ప్రయత్నిస్తామని అధికారులు అంటున్నారు. 
 
కాగా, నిర్భయ కేసులో శర్మ, ముకేశ్, పవన్, అక్షయ్, రామ్ సింగ్, ఓ మైనర్ బాలుడు నిందితులు కాగా, మైనర్ బాలుడు విడుదలయ్యాడు. రామ్ సింగ్ జైల్లోనే ఉరేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే. మిగిలిన నలుగురినీ ఉరితీయాల్సి వుంది. ఇటీవల శర్మ మెర్సీ పిటిషన్ పెట్టుకోగా, దాన్ని తిరస్కరించాలని ఢిల్లీ సర్కారు సిఫార్సు చేసింది.