మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 5 ఆగస్టు 2019 (10:28 IST)

#KashmirParFinalFight ఇంటర్నెట్ సేవలు కట్.. ఉద్రిక్త వాతావరణం

జమ్మూకాశ్మీర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాశ్మీర్‌లో మునుపెన్నడూ లేని పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో.. ఆ రాష్ట్ర భవితవ్యంపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సోమవారం ఉదయం 9:30 గంటలకు జరగబోయే కేంద్ర కేబినెట్ సమావేశంలో కాశ్మీర్ భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 
 
కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం.. లేదా కాశ్మీర్‌ను మూడు రాష్ట్రాలుగా విభజించడం అనే ఎత్తుగడతో కేంద్రం ముందుకు కదులుతోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోమవారం లేదా మంగళవారం కేంద్రం చర్యలపై కొంతలో కొంతైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
 
ఈ నేపథ్యంలో కాశ్మీర్‌ లోయలో అడుగడుగునా భద్రతా బలాలను మోహరించారు. కాశ్మీర్‌ మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను ఆదివారం రాత్రి నుంచి గృహ నిర్బంధం చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. బహిరంగ సమావేశాలు, గుంపులుగా తిరగడాలను నిషేధించారు. శ్రీనగర్ జిల్లాలో సెక్షన్ 144 అమలుచేశారు. 
 
కాగా, కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు తమ దేశ పర్యాటకులను కాశ్మీర్ నుంచి వెనక్కి రావాల్సిందిగా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇక కాశ్మీర్‌లోని ఎన్ఐటికి సెలవులు ప్రకటించి.. విద్యార్థులను కూడా ఖాళీ చేయించింది కేంద్ర ప్రభుత్వం. అమర్‌నాథ్ యాత్ర ప్రయాణికులను కూడా వెనక్కి పంపించేసింది.