శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Modified: శనివారం, 24 ఏప్రియల్ 2021 (11:32 IST)

ఒక్క రూపాయికే ఆక్సిజన్ సిలిండర్: వ్యాపారి పెద్ద మనసు, నెటిజన్లు ప్రశంసలు

లక్నో: కోవిడ్‌ మహమ్మారి దేశాన్ని కకావికలం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. దాంతో ఆస్పత్రుల్లో బెడ్స్‌, ఆక్సిజన్‌ కొరత ఏర్పడుతోంది. ప్రాణవాయువు నిల్వలు అయిపోవడంతో ఢిల్లీలోని ఓ వ్రైవేట్‌ ఆస్పత్రిలో 24 గంటల వ్యవధిలో 25 మంది కోవిడ్‌ రోగులు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో ఆక్సిజన్‌కు భారీ ఎత్తున డిమాండ్‌ ఏర్పడింది. దాంతో అక్రమార్కులు బ్లాక్‌లో ఆక్సిజన్‌ సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. ఇంత ధర చెల్లించలేని వారు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారి పెద్ద మనసుతో ముందుకొచ్చాడు. కేవలం ఒక్క రూపాయికే ఆక్సిజన్‌ సిలిండర్‌ని రిఫిల్‌ చేస్తున్నాడు. ఆ వివరాలు.. యూపీకి చెందిన వ్యాపారవేత్త మనోజ్‌ గుప్తా.. హమీర్‌పూర్ జిల్లాలోని సుమెర్‌పూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో రిమ్‌జిమ్ ఇస్పాత్ ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. ఈ క్రమంలో కరోనా వైరస్ బాధితుల కోసం కేవలం రూపాయికే ఆక్సిజన్ సిలిండర్లు రిఫిల్ చేసి ఇస్తున్నాడు. ఇప్పటివరకు గుప్తా సుమారు వెయ్యికి పైగా ఆక్సిజన్ సిలిండర్లను రిఫిల్ చేశారు. వందకు పైగా కోవిడ్ బాధితుల ప్రాణాలు కాపాడాడు.
 
ఈ సందర్భంగా గుప్తా మాట్లాడుతూ.. ‘‘2020లో నేను కోవిడ్ బారిన పడ్డాను. అప్పుడు నేను కూడా ఆక్సిజన్ సమస్య ఎదుర్కొన్నాను. నా బాటిల్ ప్లాంట్‌కు రోజుకు వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లను రిఫిల్ చేసే సామర్థ్యం ఉంది. దాంతో ఆక్సిజన్‌ కావాల్సిన సామాన్యుల కోసం ఇలా ఒక్క రూపాయికే సిలిండర్‌ రిఫిల్‌ చేసి ఇస్తున్నాను. ఇందుకుగాను హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న బాధితుల కుటుంబికులు ఆర్టీ-పీసీఆర్ రిపోర్ట్, డాక్టర్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు చూపిస్తే.. వారికి ఒక్క రూపాయికే సిలిండర్ అందిస్తున్నాను’’ అని తెలిపాడు.

ఈ సమాచారం తెలియగానే ఝాన్సీ, బందా, లలిత్‌పూర్, కాన్పూర్, ఓరాయ్ తదితర జిల్లాల నుంచి కూడా కరోనా బాధితుల కుటుంబికులు గుప్తా ప్లాంట్‌‌ వద్ద క్యూ కడుతున్నారు. ఇక మనోజ్‌ గుప్తాపై నెటిజనుల ప్రశంసలు కురిపిస్తున్నారు.