గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 30 మే 2018 (09:28 IST)

టీడీపీ వాళ్లు ఇసుకను కరకరా నమిలేస్తున్నారు.. నదులు బావురుమంటున్నాయి...

తెలుగుదేశం పార్టీ నేతలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ దఫా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీని ప్రధాన అస్త్రంగా చేసుకుని ఆయన బాణాలు సంధించారు.

తెలుగుదేశం పార్టీ నేతలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ దఫా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీని ప్రధాన అస్త్రంగా చేసుకుని ఆయన బాణాలు సంధించారు. తాను చేపట్టిన ప్రజా పోరాట యాత్రలో భాగంగా శ్రీకాకుళం పట్టణంలో ప్రభుత్వాల తీరుపై నిరసన కవాతు నిర్వహించి... అక్కడి ఏడు రోడ్ల జంక్షన్‌లో పవన్ భారీ బహిరంగ సభ నిర్వహించారు.
 
ఇందులో ఆయన ప్రసంగిస్తూ, తెలుగుదేశం పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఇసుక అంటే ఎంత ఇష్టమో! కనిపిస్తే చాలు కరకరా నమిలేస్తున్నారు. ఇసుక దోపిడీకి నదులు బావురుమంటున్నాయి. ముఖ్యమంత్రి అంటున్నారు... జనసేనకు ఒక శాతం ఓట్లే వస్తాయి అని. అలాంటి ఆయన గత ఎన్నికల ముందు హైదరాబాద్‌లోని మన పార్టీ ఆఫీస్‌కి వచ్చి మరీ మద్దతు అడిగారు. ఆయనది ఏరు దాటాకా తెప్ప తగలేసే రకం. మీ మాటలు, కథలు వినేందుకు ఇక్కడ ఎవరూ పాత తరంవాళ్లు లేరు. ఇక్కడ ఉన్నది కత్తులు దూసే యువత అని గుర్తుపెట్టుకోండి అంటూ చంద్రబాబును పవన్ హెచ్చరించారు. 
 
ఇకపోతే, విభజన హామీ మేరకు సాధించుకోవాల్సిన ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు గత మూడేళ్ళలో 36 సార్లు మాట మార్చారు. బీజేపీ వాళ్లు హోదా అనేది గడచిన అధ్యాయం అంటారు. అటువంటి వారిని అంబారీలు ఎక్కించి, అమరావతిలో సన్మానాలు చేసింది తెలుగు దేశం వాళ్లే. అలా సన్మానాలు చేసి కాంట్రాక్టులు తెచ్చుకున్నారు. రాష్ట్రానికి మాత్రం హోదా సాధించలేదు. శ్రీకాకుళం జిల్లాలో ఏ మూలకి వెళ్లినా అధికార పార్టీ వాళ్ల భూకబ్జాలు, ఇసుక దోపిడీ గురించే మాట్లాడుతున్నాంటూ ధ్వజమెత్తారు. 
 
భూగర్భ జలాల్ని కలుషితం చేసే పరిశ్రమల్ని ఇక్కడ పెట్టిస్తున్నారు. అంటే ప్రజలకి రక్షిత మంచి నీళ్లు కూడా దక్కనీయరా? అచ్చెన్నాయుడు డబ్బున్న వ్యక్తి కాబట్టి మినరల్ వాటర్ తాగుతారు. మరి సామాన్యుడి పరిస్థితి ఏమిటి? గుజరాత్ వాళ్లు వద్దంటే అణు విద్యుత్ కేంద్రాన్ని ఈ జిల్లాలోని కొవ్వాడలో పెట్టిస్తున్నారు. పచ్చని భూములు లాక్కొంటున్నారు. ఇలాంటి విద్యుత్ కేంద్రం వల్ల ఉపద్రవం వస్తే ఏమీ మిగలదని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.