గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 అక్టోబరు 2020 (12:33 IST)

రైలు ప్రయాణికులు సీఆర్పీఎఫ్ సీరియస్ వార్నింగ్!!

దేశంలో పండుగ సీజన్‌ ప్రారంభంకానుంది. దీంతో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక బస్సులతో పాటు.. ప్రత్యేక రైళ్ళను నడిపేందుకు రైల్వేశాఖతో పాటు.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. రైల్వే శాఖ ఇప్పటికే వందల సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడుపనుంది. దసరా స్పెషల్ పేరుతో ఈ రైళ్లను నడుపనుంది. ఇందుకోసం కట్టుదిట్టమైన భద్రతా చర్యలను కూడా చేపట్టనుంది. దీనికి కారణం ప్రపంచాన్ని వణకిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భయమే. 
 
ప్రస్తుతం కరోనా రోగులు ఎక్కడ ఉన్నారో, ఈ వైరస్ ఎవరికి సోకివుందో తెలియదు. దీంతో రైల్వే శాఖ కఠిన ఆంక్షల మధ్య రైళ్లను నడుపుతోంది. ఈ నేపథ్యంలో కరోనా సంక్రమించిన వ్యక్తులు రైలెక్కితే జరిమానా, జైలు శిక్ష తప్పవని రైల్వే భద్రత దళం (ఆర్‌పీఎఫ్) హెచ్చరించింది. 
 
పండుగల నేపథ్యంలో రైలు ప్రయాణాలకు జనం పోటెత్తనున్న నేపథ్యంలో ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటికి విరుద్ధంగా వ్యవహరిస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది.
 
ముఖ్యంగా, కరోనా పరీక్షలు చేయించుకుని, ఫలితం రాకముందే స్టేషన్‌కు రావడం, రైలెక్కడం, భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కు సరిగా ధరించకపోవడం వంటి వాటిని తీవ్రంగా పరిగణించనున్నట్టు స్పష్టం చేసింది. 
 
కరోనా వ్యాప్తికి కారణమయ్యే ఎటువంటి పనులు చేసినా నేరం కిందే పరిగణించి జరిమానా విధిస్తామని, జైలు శిక్ష కూడా తప్పదని ఆర్‌పీఎఫ్ అధికారులు హెచ్చరించారు.