శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 నవంబరు 2019 (14:03 IST)

విజయం మాదే ... సోనియా :: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బీజేపీ .. రౌత్

మహారాష్ట్ర అసెంబ్లీ వేదికగా జరిగే బలపరీక్షలో అంతిమ విజయం తమదేనని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. బుధవారం సాయంత్రంలోగా బలపరీక్ష నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేయడాన్ని తాము స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఈ తీర్పు చారిత్రాత్మకమని, బలపరీక్షలో విపక్షాలదే విజయమని ఆమె వ్యాఖ్యానించారు. 
 
అలాగే, శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ, మెజారిటీ నిరూపించుకోవడానికి బీజేపీ భయపడుతోందని, ఆ పార్టీ నేతలు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. 'మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌తో ప్రమాణస్వీకారం చేయించి బీజేపీ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. సత్యమేవ జయతే అనే దేశ నినాదాన్ని కూడా ఖూనీ చేశారు. వారెందుకు భయపడుతున్నారు? మెజారిటీ నిరూపించుకోకుండా ఎందుకు పారిపోతున్నారు? న్యాయం కోసం మేము సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించాల్సి వస్తుంది?' అని వ్యఖ్యానించారు. 
 
'రాజ్యాంగంపై మంగళవారం పార్లమెంటులో చర్చ జరుపుతున్నారు. ఇది అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగమేనా? మాకు 162 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. సోమవారం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ ఒకే చోట కలిశారు. మేము బల ప్రదర్శన చేస్తున్నామని మీడియా పేర్కొంది. కానీ, మాకున్న మద్దతును మహారాష్ట్ర ప్రజలకు, రాష్ట్రపతి భవన్, రాజ్‌భవన్‌కు తెలపడానికే మేమంతా ఒకేచోట కలిశాం' అని సంజయ్ రౌత్ వివరించారు. 
 
అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పుపై శివసేన నేతలు స్పందిస్తూ, ఈ తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఇది ప్రజాస్వామ్య విజయమని అన్నారు. 'ఖేల్‌ ఖతం' అని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత నవాబ్‌ మాలిక్‌ ట్వీట్‌ చేశారు. కాగా, ఎన్సీపీ నేతలతో ఆ పార్టీ అధినేత శరద్ పవార్ సమావేశమయ్యారు. రేపటి బలపరీక్షపై చర్చిస్తున్నారు.