శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 నవంబరు 2019 (16:44 IST)

సుప్రీం చెంతకు 'మహా' పంచాయతీ... క్షణానికో మలుపు

మహారాష్ట్ర పంచాయతీ సుప్రీంకోర్టు చెంతకు చేరింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం తమకు సమయం పొడగించేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ నిరాకరించారు. దీన్ని సవాల్ చేస్తూ శివసేన పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పైగా, తమ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలంటూ విజ్ఞప్తి చేసింది.
 
మరోవైపు, శివసేన తరపున వాదనలు వినిపించేందుకు ఇప్పటికే ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్‌తో మంతనాలు జరిపారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కోసం తమకు మూడు రోజుల పాటు సమయం ఇవ్వకపోవడమే ప్రధానాంశంగా ఆ పార్టీ సుప్రీంకోర్టుకు నివేదించనున్నట్టు సమాచారం. 
 
మరోవైపు, ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్సీపీకి ఇచ్చిన గడువు ముగియకముందే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ కోష్యారీ కేంద్రానికి సిఫార్సు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై కూడా శివసేన సుప్రీంకోర్టులో సవాల్ చేయనుంది. మొత్తంమీద మహారాష్ట్ర రాజకీయాలు క్షణానికో విధంగా మారిపోతున్నాయి. 
 
ఇంకోవైపు, ప్రధాని నరేంద్ర మోడీ సైతం అత్యవసరంగా తన నివాసంలోనే కేంద్ర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందలో మహారాష్ట్ర సంక్షోభం, రాష్ట్రపతి పాలనపై చర్చించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
 
ఇదిలావుంటే, ప్రస్తుత పరిస్థితుల్లో శివసేనతో చేతులు కలపడం సరికాదనే ఆలోచనలో కాంగ్రెస్‌ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ నాయకుడిని సీఎంను చేస్తే ఎన్సీపీ సర్కార్‌కు మద్దతిస్తామని శివసేన ఊరిస్తోంది. శరద్‌పవార్‌ చక్రం తిప్పుతారని.. శివసేన, కాంగ్రెస్‌ మద్దతుతో తమ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ఎన్సీపీ ధీమా వ్యక్తం చేస్తోంది.