శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శుక్రవారం, 23 ఆగస్టు 2019 (13:45 IST)

ఈడీ కేసులో చిదంబరంకు ముందస్తు బెయిల్.. సీబీఐ కేసులో మాత్రం కస్టడీ

ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరంకు ఓ కేసులో స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు అరెస్టు చేయకుండా వుండేందుకు వీలుగా ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరైంది. 
 
ఈ కేసులో ఈడీ నుంచి రక్షణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. చిదంబరానికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఆగస్టు 26 వరకు ఈడీ అధికారులు ఆయనను అరెస్టు చేయరాదని స్పష్టం చేసింది. అయితే ఆయన విచారణకు సహకరించాలని సూచించింది. ఈడీ, సీబీఐ రెండు కేసులపై సోమవారం మరోసారి విచారణ జరుపుతామని వెల్లడించింది. 
 
ఇదిలావుంటే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాత్రం చిదంబరంను అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దీంతో నాటకీయ పరిణామాల మధ్య చిదంబరంను బుధవారం రాత్రి అరెస్టు చేశారు. ఆ తర్వాత గురువారం మధ్యాహ్నం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా నాలుగు రోజుల సీబీఐ కస్టడీ విధించింది. 
 
అదేసమయంలో ఈ కేసులో సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 26వ తేదీకి వాయిదా వేసింది. చిదంబరం ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు. ఆ కస్టడీ సోమవారం పూర్తవనున్నందున అదే రోజున ఆయన అరెస్టు పిటిషన్‌పై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు వెల్లడించింది.