గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2019 (09:01 IST)

హరిద్వార్‌లో పవర్ స్టార్, దేశంలోని నదులను కాపాడుకోవాలి.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

గంగను కాలుష్యానికి గురిచేయడం అంటే మన సంస్కృతిని కలుషితం చేయడమేనని జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్నారు.

తాను పోరాటయాత్రలో ఉండగా జి.డి అగర్వాల్ మరణవార్త తెలిసిందని ఒక మహత్తర కార్యక్రమం కోసం ఆయన ప్రాణాలు అర్పించడం త‌న‌ను తీవ్రంగా కలచివేసిందన్నారు. విద్యావేత్త, ఆధ్యాత్మిక గురువు, గంగా ప్రక్షాళణ కోసం పోరాటం చేసి అసువులు బాసిన ప్రొఫెసర్ జి.డి.అగర్వాల్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడానికి జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ గురువారం సాయంత్రం హరిద్వారకు చేరుకున్నారు.

వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన, రామన్ మొగసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్ ఇటీవల హైదరాబాద్‌లో జనసేన పార్టీ కార్యాలయాన్ని సందర్శించి పవన్ కళ్యాణ్‌తో సమావేశం అయిన సందర్భంలో అగర్వాల్ ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.

పిలిచిన వెంటనే కార్యక్రమంలో తప్పకుండా పాల్గొంటానని పవన్ కళ్యాణ్ నాడు హామీ ఇచ్చారు. అన్న మాట ప్రకారం వెన్నునొప్పి బాధ ఇంకా పూర్తిగా తగ్గనప్పటికీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ప‌వన్ కళ్యాణ్ హరిద్వార్  వెళ్లారు. సాయంత్రం 4 గంటలకు డెహ్రడూన్ చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి నేరుగా హరిద్వార్‌లోని శివారు ప్రాంతంలో ఉన్న మాత్రి సదన్ ఆశ్రమానికి వెళ్లారు.

ఈ ఆశ్రమాన్నే కేంద్రంగా చేసుకుని జి.డి.అగర్వాల్ గంగా ప్రక్షాళణ పోరాటం జరిపారు. ఆశ్రమ గురూజీ స్వామి శివానంద మహరాజ్, వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్‌లు పవన్ కళ్యాణ్‌కు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు సంప్రదాయ సిద్ధమైన తలపాగను రాజేంద్రసింగ్ కట్టారు. గంగా నదిని పరిశ్రమలు, ప్రభుత్వాలు ఏ విధంగా కలుషితం చేస్తున్నాయో ఈ సందర్భంగా శివానంద మహరాజ్ పవన్‌కు వివరించారు.

ఇదే ఆశ్రమానికి చెందిన స్వామి నిగమానంద సరస్వతి గంగా ప్రక్షాళణ కోసం అన్న పానీయాలు మాని 115 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి చివరికి అసువులు బాశారు. 30 ఏళ్ల వయసులోనే ఆయన ఓ సత్కార్యం కోసం ప్రాణాలు అర్పించారని శివానంద్ మహరాజ్ తెలిపారు.

పవన్ గురించి, ఆయన పోరాట స్ఫూర్తి గురించి తాను తెలుసుకున్నానని, గంగా ప్రక్షాళణ పోరాట యాత్రకు ఆయన బాసట కావాలని కోరారు. దక్షిణాది నుంచి గంగా ప్రక్షాళణ పోరాటానికి తగినంత మద్దతు లభించడం లేదని పవన్ కళ్యాణ్ దానిని భర్తీ చేయాలని కోరారు.

రాజేంద్ర సింగ్ మాట్లాడుతూ.. జి.డి. అగర్వాల్‌లో ఉన్న పోరాట స్ఫూర్తిని తాను పవన్ కళ్యాణ్‌లో చూశానని అన్నారు. కార్యక్రమంలో పాల్గొనాలని పిలిచిన వెంటనే పవన్ ఒక్క సెకను కూడా ఆలోచించ కుండా తాను తప్పక వస్తానని చెప్పి, ఇప్పుడు అన్నమాట నిలబెట్టుకున్నారని అన్నారు. గంగా ప్రక్షాళణ కోసం పవన్ కళ్యాణ్ కృషి చేయాలని ఆయన కోరారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... గంగను కాలుష్యానికి గురిచేయడం అంటే మన సంస్కృతిని కలుషితం చేయడమేనని అన్నారు. తాను పోరాటయాత్రలో ఉండగా జి.డి అగర్వాల్ మరణ వార్త తెలిసిందని ఒక మహత్తర కార్యక్రమం కోసం ఆయన ప్రాణాలు అర్పించడం నన్నెంతో కలచివేసిందన్నారు. ఆ రోజునే తాను హరిద్వార్ వచ్చి జి.డి. అగర్వాల్ కి నివాళులు అర్పిద్దామనుకున్నానని, అయితే పోరాట యాత్రలో ఉన్నందువల్ల రాలేకపోయానని చెప్పారు.

ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చి ఆయన పట్ల త‌న‌కున్న భక్తి శ్రద్దలను వ్యక్తం చేయడం ఒక మహద్భాగ్యంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. కాలుష్యం నుంచి ఒక్క గంగనే కాదని, భారత దేశంలోని అన్ని నదులను కాపాడుకోవాలని కోరారు. గంగా ప్రక్షాళణ పోరాటం దీనికి నాంది కావాలని అన్నారు.

తొలుత పవన్ కళ్యాణ్ స్వామి నిగమానంద సరస్వతి సమాధిని సందర్శించి అంజలి ఘటించారు. అనంతరం ఆశ్రమం పక్కనే ప్రవహిస్తున్న గంగా నది వద్ద జరిగిన హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. శుక్ర‌వారం కూడా పవన్ కళ్యాణ్ హరిద్వార్‌లోని పవన్ ధామ్ ఆశ్రమంలో విడిది చేస్తున్నారు. ఆయనతో పాటు రాజేంద్రసింగ్ కూడా అక్కడే బస చేస్తున్నారు.