మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Updated : ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (17:23 IST)

దేశ అత్యున్నత పదవుల్లో ఇద్దరు తెలుగువాళ్లు... నెట్టింట ఫొటో వైరల్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో నెట్టింట ఓ ఫొటో వైరల్ అవుతోంది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ... ఒకరికొకరు అభివాదం చేసుకుంటూ నిలుచున్న ఫొటో అది.

ప్రమాణ స్వీకారం అనంతరం.. చీఫ్ జస్టిస్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్య శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కరించారు. మర్యాదపూర్వకంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రతి నమస్కారం చేశారు. ఇప్పుడీ ఫొటోను తెలుగు నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఇద్దరు తెలుగువాళ్లు దేశ అత్యున్నత పదవుల్లో ఉండటం సాటి తెలుగువారికి గర్వకారణం అంటూ ట్వీట్ చేస్తున్నారు.

భారత 48వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. సీజేఐ ఎస్.ఎ.బొబ్డే పదవీకాలం ముగియడంతో శనివారం ఆయన స్థానంలో జస్టిస్ రమణ బాధ్యతలు స్వీకరించారు. 2022 ఆగస్టు 26 వరకు జస్టిస్ రమణ ఈ పదవిలో కొనసాగనున్నారు.