గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 14 మార్చి 2018 (13:13 IST)

బీజేపీకి యూపీ ఓటర్లు షాకిస్తారా? బైపోల్‌లో ఓటమి దిశగా "కమలం" అభ్యర్థులు

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఓటర్లు అధికార బీజేపీకి షాకివ్వనున్నారా? బుధవారం వెలువడుతున్న రెండు లోక్‌సభ ఉపఎన్నికల ఫలితాల సరళిని చూస్తే ఇదే నిజమని తెలుస్తోంది. ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లోక్‌సభ స్థానాలకు

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఓటర్లు అధికార బీజేపీకి షాకివ్వనున్నారా? బుధవారం వెలువడుతున్న రెండు లోక్‌సభ ఉపఎన్నికల ఫలితాల సరళిని చూస్తే ఇదే నిజమని తెలుస్తోంది. ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు బాగా వెనుకబడివున్నారు. అదేసమయంలో ఎస్పీ - బీఎస్పీ కూటమి తరపున బరిలోకి దిగిన అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ముఖ్యంగా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు సొంత నియోజకవర్గమైన గోరఖ్‌పూర్‌ స్థానంలో బీజేపీ అభ్యర్థి వెనుకంజలో ఉండటం కమలనాథులు జీర్ణించుకోలేక పోతున్నారు. 
 
ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు పార్లమెంట్ నియోజకవర్గాలైన ఫుల్‌పూర్, గోరఖ్‌పూర్‌లలో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా ఓట్ల లెక్కింపు సరళిని చూస్తే తెలుస్తోంది. బుధవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, రౌండ్ రౌండ్‌కూ ఆధిక్యం మారిపోతోంది. ఇప్పటికే ఫుల్‌పూర్‌లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి సుమారు 13 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతూ విజయం దిశగా దూసుకుపోతున్నారు. 
 
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గమైన గోరఖ్‌పూర్‌లోనూ సమాజ్‌వాదీ పార్టీ ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. సమాజ్‌వాదీ అభ్యర్థి అనూహ్యంగా లీడింగ్‌లోకి రావడంతో కమలనాథుల్లో బీపీ పెంచింది. పైగా, ఈ రెండు స్థానాల్లో విజయం తమదేనని సమాజ్ వాదీ పార్టీ వర్గాలు ఢంకాబజాయించి చెపుతున్నాయి. దీంతో బీజేపీ నేతల్లో నైరాశ్యం నెలకొంది. 
 
ముఖ్యంగా, గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం బీజేపీకి ఉన్న కంచుకోటల్లో ఒకటి. యూపీ సీఎంగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ ఇక్కడ నుంచి ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1998 నుంచి 2014 వరకు ఆయన లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. పైగా, ఆయన సొంత నియోజకవర్గం కూడా. ఇకపోతే, బీహార్ రాష్ట్రంలోని అరారియా లోక్‌సభకు జరుగుతున్న ఉప ఎన్నికలో కూడా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు కూడా తేరుకోలేని దెబ్బ తగలనుంది. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థి విజయపథంలో దూసుకెళుతున్నారు.