నాతో హీరోయిన్‌గా నటిస్తావా? జయంతితో సీనియర్ ఎన్టీఆర్
జస్టిస్ చౌదరి సినిమాలో... ఎన్టీయార్ సరసన... ఈ మధుమాసంలో అంటూ సూపర్ హిట్ సాంగ్‌లో నటించిన జయంతి ఇక లేరు. అలనాటి హీరోయిన్ సీనియర్ నటి జయంతి (76) కన్నుమూశారు.
పలు దక్షిణాది చిత్రాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటి జయంతి ఆదివారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్నేళ్లుగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె ఆరోగ్యం క్షీణించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో బెంగుళూరులోని ప్రైవేటు హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ జయంతి కన్నుమూశారు. మూడు దశాబ్దాలుగా జయంతి అస్తమాతో బాధపడుతున్నారు.
1945 జనవరి 6న బళ్ళారి లో జన్మించిన జయంతి...కన్నడ సినిమా జెనుగూడు(1963)తో తెరంగేట్రం చేశారు. తెలుగు, తమిళ, హిందీ, మరాఠీ, కన్నడ, మలయాళ సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలను పోషించి నటిగా తనదైన ముద్ర వేశారు. ఇప్పటి వరకు దాదాపు 500పైగా సినిమాల్లో నటించిన ఈమె 300 సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు.
ఆమె తండ్రి బాలసుబ్రహ్మణ్యం బెంగుళూరులోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఇంగ్లీషు ప్రొఫెసర్‌గా పనిచేశారు. తల్లి సంతానలక్ష్మి. జయంతి వారికి ముగ్గురు పిల్లలలో పెద్ద కూతురు. తనకు ఇద్దరు తమ్ముళ్ళు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు వేరుకావడం వలన జయంతిని తీసుకొని తల్లి మద్రాసు చేరింది. సంతానలక్ష్మికి తన కూతుర్ని నాట్యకళాకారినిగా చేయాలనే కోరిక ఉండేది. మద్రాసులో బడికి వెళ్తూ కమలకుమారి నాటి ప్రముఖ నర్తకి, నాట్య విదుషీమణి చంద్రకళ వద్ద నాట్యం నేర్చుకోసాగింది.
ఒకనాడు తోటి విద్యార్థినులతో కలిసి ఒక కన్నడ సినిమా షూటింగ్ చూడడానికి వెళ్ళింది. ప్రముఖ కన్నడ చిత్ర దర్శకుడు వై.ఆర్.స్వామి కమలకుమారి రూపురేఖల్ని చూసి జేనుగూడు అనే సినిమా కోసం ముగ్గురు నాయికల్లో ఒకరిగా ఎంపిక చేశారు. కమలకుమారి పేరు లోగడ చాలామందికి అచ్చిరాలేదనే ఉద్దేశంతో ఆమె పేరును జయంతిగా మార్చారు.
బడి పిల్లలతో కలిసి మద్రాసుకు విహారయాత్ర వెళ్ళినప్పుడు అప్పటి సూపర్ స్టార్ ఎన్.టి.రామారావు కాస్సేపు ముచ్చటించిన తర్వాత బొద్దుగా, ముద్దుగా కనిపిస్తున్న కమలకుమారితో.. నాతో సినిమాలలో హీరోయిన్‌గా వేస్తావా' అని యథాలాపంగా అన్నారు. పన్నెండేళ్ళ కమలకుమారి బుగ్గలు ఎరుపెక్కాయి. ఆ అమ్మాయి సిగ్గుతో ముఖం కప్పుకొంది. తర్వాత కాలంలో ఆనాటి కమలకుమారి జగదేకవీరుని కథ, కులగౌరవం, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి వంటి హిట్ చిత్రాల్లో నటించారు. జయంతి మృతిపై టాలీవుడ్ సినీ వర్గాలు సంతాపాన్ని ప్రకటిస్తున్నాయి.