ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2013 14
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 డిశెంబరు 2018 (19:21 IST)

2015 రౌండప్ : పసిడి కాంతులెక్కడ? పతనానికి అనేక కారణాలు?

ఈ యేడాది బంగారం ధరలు తీవ్రమైన ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టేందుకు ఈక్విటీలపై మక్కువ చూపడంతో 2015లో పసిడి ధర పతనానికి కారణంగా మారింది. కేవలం బంగారం ధర మాత్రమే కాకుండా, వెండి ధర కూడా అధోముఖంగానే పయనించింది. ఫలితంగా ఈ యేడాది బంగారం దాదాపు 5 శాతం, వెండి 8 శాతం మేరకు పతనమైనట్టు బంగారం, వెండి వ్యాపారులు చెపుతున్నారు. అంటే బంగారం దిగుమతులు 36.48 శాతం క్షీణించి 353 కోట్ల డాలర్లకు తగ్గగా, వెండి దిగుమతులు 55 శాతం తగ్గి 28.501 కోట్ల డాలర్లకు చేరాయి. దీనికితోడు పలు తర్జాతీయ, జాతీయ కారణాలు ఈ లోహాల ధరలను కుంగదీశాయి. 
 
నిజానికి పసిడి, వెండి ధరలు తగ్గుదలకు అనేక కారణాలు లేకపోలేదు. వీటిలో ఒకటి.. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపుదలపై దీర్ఘకాలం కొనసాగిన ఊహాగానాలు, కరెన్సీ ఒడిదుడుకులు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. వీటికి చైనాలో మందగమనం జత కలవడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. వీటన్నింటితో పాటు ఈ ఏడాది దేశీయంగా బంగారం, వెండిపై పెట్టుబడుల మోజు తగ్గింది. అంతర్జాతీయంగా కూడా బంగారం వినియోగం తగ్గడం ఈ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. 
 
అలాగే, దేశీయంగా పసిడి దిగుమతులు తగ్గించేందుకు తీసుకున్న చర్యలు, మానిటైజేషన్‌ పథకం పసిడి పతనానికి కొంతమేర కారణమయ్యాయి. దేశీయంగా రుతుపవనాలు ఆశాజనకంగా లేకపోవడం గ్రామీణ ఆదాయాలను తద్వారా బంగారం కొనుగోళ్లను దెబ్బతీసింది. గోల్డ్‌ ఇటిఎఫ్‌ల నుంచి భారీగా నిధుల ఉపసంహరణ కూడా ప్రభావం చూపింది. 
 
వాస్తవానికి ఈ 2015లో 10 గ్రాముల బంగారం ధర 26,700 రూపాయల వద్ద ప్రారంభమై ఒక దశలో 28 వేల రూపాయల స్థాయిని దాటి సంవత్సర గరిష్ట స్థాయి 28,215 రూపాయలకు చేరింది. ఆ సమయంలో గ్రీస్‌ భయాలతో స్టాక్‌ మార్కెట్లు సంక్షోభంలో పడ్డాయి. పిమ్మట జూలైలో భారీగా పతనమైన పసిడి ఒక దశలో 24,590 రూపాయల కనిష్టస్థాయికి చేరింది. 
 
అనంతరం దేశీయంగా చోటుచేసుకున్న పరిణామాల వల్ల రూ.27 వేల స్థాయికి చేరినా మళ్లీ దిగజారి ప్రస్తుతం 25,500 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. కిలో వెండి ధర రూ.37,200 రూపాయల వద్ద ప్రారంభమై, ప్రస్తుతం 34,300 రూపాయల వద్ద కదలాడుతోంది. బంగారం ధర పతనం కావడం వరుసగా ఇది మూడో సంవత్సరం. సంవత్సరం మొత్తంలో ధరలు పడుతూ, లేస్తూ ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. ఏడాది చివర్లో దిగుమతులపై నిబంధనలను సడలించినా పెద్దగా ప్రభావం చూపలేక పోవడం గమనార్హం.