మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. వాలెంటైన్స్ డే
Written By chj
Last Modified: సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (19:33 IST)

ప్రేమను వెలిగించి ఆ దీపాన్ని ఆర్పేయరాదు... ప్రేమ పవరెంతంటే?

ఈ సృష్టిలో అన్నింటి కంటే మధురమైనది, విలువైనది ప్రేమ. ప్రేమ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర అవగాహన. ప్రేమ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య నమ్మకం. ఐతే నేడు ప్రేమికుల మధ్య ఉండాల్సిన ప్రేమ, అవగాహన, నమ్మకం రోజురోజుకు ఆవిరైపోతున్నాయి. నేటి సమాజంలో ప్రేమికుల మధ

ఈ సృష్టిలో అన్నింటి కంటే మధురమైనది, విలువైనది ప్రేమ. ప్రేమ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర అవగాహన. ప్రేమ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య నమ్మకం. ఐతే నేడు  ప్రేమికుల మధ్య ఉండాల్సిన ప్రేమ, అవగాహన, నమ్మకం రోజురోజుకు ఆవిరైపోతున్నాయి. నేటి సమాజంలో ప్రేమికుల మధ్య ప్రేమ కంటే ఆకర్షణే ఎక్కువగా కనబడుతోంది. రెండు మనసుల కలయిక ప్రేమ. కానీ అందుకు విరుద్ధంగా కొంతమంది అనాలోచితంగా శారీరక ఆనందానికే ఎక్కువ విలువనిస్తున్నారు.
 
భవితను అంధకారం చేసుకుంటున్నారు. అమ్మాయి అందాన్ని చూసి మోజులో పడిన ప్రేమలు, అబ్బాయిల ఆడంబరాన్ని, అతని బైకుల్ని చూసి మొలకెత్తే ప్రేమలు ఎక్కువ కాలం నిలబడవు. ప్రేమ మధురాతి మధురమైనది. గాలి వీచినంత సహజంగా, నీరు ప్రవహించినంత నిర్మలంగా, పూలతావిలా తాజాగా ప్రేమ పుడుతుంది. అలా పుట్టి, పెరిగిన ప్రేమను వ్యక్తం చేయడానికి వాలెంటైన్స్‌ డే లాంటిది ఒక సందర్భం మాత్రమే. కానీ ఆ రోజు సెలబ్రేట్ చేసుకోవడం కోసమే నలుగురిలో గొప్పగా చెప్పుకోవడం కోసమే ప్రేమించడం మాత్రం ప్రేమ అవదు.
 
ప్రేమికులు తమ ప్రేమను పది కాలాల పాటు పదిలంగా కాపాడుకోగల ధైర్యం, అవసరమైతే తల్లిదండ్రులను, సమాజాన్ని సైతం ఎదిరించి మనగలిగిన ఆత్మస్థైర్యం ఉండాలి. వ్యక్తిత్వం లేని వాళ్లు ప్రేమకు అనర్హులు. ప్రేమకు ముందు ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని ఆచితూచి అంచనా వేసుకోవాలి. వ్యక్తిత్వం లేని ప్రేమలు ఎక్కువ కాలం జీవించలేవు. బాహ్య సౌందర్యం కంటే అంత:సౌందర్యానికి విలువ ఇచ్చే ప్రేమలు ఎక్కువ కాలం నిలుస్తాయి. ప్రేమ ఎంత మధురమైనదో వికటిస్తే అంత వెగటుగాను ఉంటుంది. వాలెంటైన్స్‌డే నాడు ప్రేమ జంటలు మనసు విప్పి మాట్లాడుకోవడమే కాదు విచ్చలవిడిగా తిరిగి హద్దులు మీరే ప్రమాదం కూడా పొంచి ఉంది. కొంతమంది జీవితాలు వికసిస్తే మరికొందరి జీవితాలు ఛిద్రమయ్యే ప్రమాదముంది.
 
ప్రేమ ఉచ్చులో పడిన అమ్మాయిలు అనాలోచితంగా తమ విలువైన మాన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఆత్మహత్యలు సర్వసాధారణమైనవిగా తలచడం అమానుషం. అమ్మాయైనా అబ్బాయైనా ఆత్మహత్యకు పాల్పడే ముందు తాము చేస్తున్నది ఎంతవరకు సరైనదో ఆలోచిస్తే అర్ధమవుతుంది. ఒక మోసగాడు లేదా మోసగత్తె కోసం తమ విలువైన ప్రాణాలను విడనాడటం వెర్రితనమనిపిస్తుంది. జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. అవి యాథృచ్ఛికమైనవిగా భావించి మరిచిపోవాలి. మళ్లీ జీవితంలో అటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్తపడాలి. మనసును ప్రగతిబాట వైపు మళ్లించుకోవాలి. అవసరమైతే కళ్ల ముందు తప్పు కనిపిస్తే తప్పుకోకుండా ఖండించగలగాలి. సాటి స్త్రీపై జరుగుతున్న అత్యాచారాలను ఆపగలగాలి. ఎదుటి మనిషికి శాయశక్తులా సహాయపడాలి. జీవితమంటే ప్రేమ ఒక్కటే కాదు. ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే.
 
నేటి కాలంలో ప్రేమ అంటే తెలియక వయసుతో సంబంధంలేకుండా చేష్టలు వికృతంగా ఉండి ఎన్నో జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. వయసురీత్యా కలిగే శారీరక అనుభూతలు, వాటి వల్ల కలిగే నష్టాలు, ఎప్పుడు ఏది అవసరమో పిల్లలకు అవగాహన కలుగచేయాలి. ప్రకృతిసిద్ధంగా భావజాలాలు, స్పందనలు కలిగినా ఏవి ఎంతవరకూ తమ జీవితాలకు ఉపయోగపడతాయో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలియజెప్పాలి. అంతేకాదు తమ జీవితంలో ఎదురుపడిన సంఘటనల పట్ల యువత ఎవరితోనైనా పంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి. మంచి వ్యక్తులతో స్నేహాలు, భయపడకుండా ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగేయడం, ఎవరైనే ప్రేమ పేరుతో తమను ప్రేరేపించినా సున్నితంగా తిరస్కరించడం, వారికి అవసరమైతే దానిలోని మంచిచెడులను తెలియజేయాలి. 
 
అంతేతప్ప అవతలి వ్యక్తి ఉద్ధేశాలకు భంగం కలిగించినా అది ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎంత చెడు చేస్తుందన్నా, మంచి కోసమూ ప్రయత్నిస్తుంది. మనకు అవసరమైన మేరకు సమాచారం దానిలోనూ దొరుకుతుంది. ప్రేమలో విఫలమైనప్పుడు ఆన్ లైన్ కౌన్సిలింగ్ తీస్కోవచ్చు. భావాలను పంచుకోవచ్చు. చక్కని సమాధానం దొరుకుతుంది. అంతేతప్ప తెలియని ప్రేమ కోసం జీవితాలు పాడు చేసుకోరాదు. ప్రేమికులుగా ప్రేమను వెలిగించి ఆ దీపాన్ని ఆర్పేయరాదు.