1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : బుధవారం, 6 ఆగస్టు 2014 (19:22 IST)

వాస్తు ప్రకారం ఎటాచ్డ్ బాత్‌రూములు ఎలా ఏర్పాటు చేసుకోవాలి?

ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా ఎటాచ్డ్ బాత్‌రూములు ఉంటున్నాయి. పూర్వ కాలం బాత్‌రూములను విడిగా బయట కట్టుకునేవారు. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో సౌకర్యం కోసం, ఆధునికమైన ఎటాచ్డ్ టాయ్‌లెట్లను నిర్మించుకుంటున్నారు. మిగతా ఇంటినంతా వాస్తు ప్రకారం కట్టినప్పటికీ, బాత్‌రూములను వాస్తు రీత్యా కట్టకపోతే వాటి ప్రభావం ఇంటిపై పడుతుంది. వీటిని వాస్తు ప్రకారం కట్టుకునేందుకు కొన్ని సూచనలు మీకోసం ...
 
నైరుతి మూలలో పడకగదిని నిర్మించడం ద్వారా మీకు శుభాలు కలుగుతాయి. ఈ గదిలో తూర్పువైపుగా దక్షిణపు గోడను ఆనుకునే విధంగా బాత్‌రూములను నిర్మించాలి. ఈ దక్షిణ గోడకు వెంటిలేటర్‌ను అమర్చాలి. పశ్చిమ - వాయవ్యంలో బాత్‌రూములు తలుపును పెట్టుకోవాలి. 
 
అలాగే నైరుతి వైపున రెండు బెడ్‌రూములను కట్టాల్సి వచ్చినపుడు, ఎటాచ్డ్ బాత్‌రూములను కూడా నిర్మించాల్సి వచ్చినపుడు నైరుతిలో ఓ గదిని కట్టి దానికి తూర్పువైపున రెండు బాత్‌రూములను నిర్మించండి. రెండో బాత్‌రూమును ఆనుకుని తూర్పువైపున మరో పడక గదిని నిర్మించుకోవచ్చు. అయితే ఈ నిర్మాణాలన్నీ కూడా దక్షిణ గదిని ఆనుకుని ఉండాలని మర్చిపోకూడదు.
 
అలాగే నైరుతి వైపు నుండి తూర్పుభాగం వైపు, దక్షిణ గోడను ఆనుకుని నిర్మించుకున్నబెడ్‌రూములో దక్షిణం వైపు మీ తలలు ఉండేలా పడకలు ఏర్పాటు చేసుకోండి. నిద్ర లేచిన వెంటనే ఉత్తర దిశను చూసి, ఆ తర్వాత ఆ దిశగా కాస్త నడక సాగించి, పశ్చిమంగా లేదా వాయువ్య దిశలో బాత్‌రూములకు వెళ్లాలి. ఇలా చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి.