శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By Eswar
Last Modified: గురువారం, 31 జులై 2014 (12:28 IST)

ధైర్యానికే ధైర్యానిచ్చిన లక్ష్మీ మాధవి

సంకల్పం గొప్పదా? విధిరాత గొప్పదా? అంటే విధిరాతను తలదన్నే సంకల్పమే గొప్పదని ఆమె నిరూపించింది. మనోధైర్యమే మంత్రదండంగా ముందుకు సాగింది. కలిసిరాని కాలం కన్నెర్ర చేసినా ధైర్యే సాహసి లక్ష్మీ అంటూ ఆ కాలాన్నే తనకు అనుకూలంగా మలుచుకుంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. దక్షిణాదిలోనే నంబర్‌వన్‌గా నిలిచింది. ఇప్పుడామే ధైర్యానికి, సాహసానికే పర్యాయపదమైంది.
 
లక్ష్మి మాధవి.. ఎస్‌ఐగా బాధ్యతలు తీసుకున్నప్పట్నుంచీ ఎక్కడా తలొగ్గలేదు. ఎంతో చురుకుదనంతో నేరస్థులకు సింహస్వప్నమయ్యారు. అప్పటి నుంచే యూఎన్ఓ శాంతి భద్రత దళాలకు వెళ్లాలని కలలు కన్నారు. ఎస్‌ఐగా పటాన్ చెరువు, వికారాబాద్, గోపాలపురం, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్స్‌లో పని చేశారు. 
 
ఓరోజు శ్రీనగర్ కాలనీలో వాహనాలు తనిఖీ చేస్తుండగా విధి బస్‌ రూపంలో లక్ష్మిని వెంటాడింది. రాంగ్ రూట్‌లో వచ్చిన బస్సు వెనక నుంచి ఢీ కొట్టడంతో లక్ష్మి వెన్నుపూస విరిగిపోయింది. వారం రోజుల పాటు కోమాలోకి వెళ్లిపోయింది. అంతేకాదు జ్ఞాపకశక్తిని కూడా కోల్పోయింది.
 
కుటుంబీకుల అండదండలు 
ఆశయాలు నీరుగారిపోయాయి. తల్లిదండ్రులు బాధపడ్డారు. ఎన్నో ఆశలతో పోలీస్ రంగాన్ని ఎంచుకున్న మాధవి ఏడాది పాటు బెడ్‌కి పరిమితమైంది. అయినా ఆమెలోని ఆశ చనిపోలేదు. ఎంతో ఇష్టపడ్డ పోలీస్ జాబ్‌ను వదులుకోలేక అప్పటి సిపి ప్రసాదరావును కలిసి మళ్లీ విధుల్లో చేరింది. మెమొరీ లాస్ వల్ల ప్రతి విషయాన్ని మర్చిపోతుండటంతో.. స్నేహితులు కుటుంబీకులు అండగా నిలబడ్డారు. ప్రతి విషయాన్ని అర్థమయ్యేలా చెప్పి మామూలు స్థితికి తీసుకొచ్చారు.
 
కోరుకున్న కొలువు సాకారమైందిలా.. 
2012లో యూఎన్ఓ శాంతిభద్రత బలగాల కోసం నోటిఫికేషన్ వచ్చింది. ఆ ఫోస్ట్ కోసం వేచి ఉన్న లక్ష్మి మాధవి తిరిగి అప్లై చేసింది. మొదట రీడింగ్ పవర్, రైటింగ్‌ పవర్, మెంటల్ ఎబిలిటి లాంటి పరీక్షల్లో 100కు 100 మార్కులు సాధించింది. డ్రైవింగ్, ఫైరింగ్, రన్నింగ్‌లో ఫస్ట్ క్లాస్‌లో వచ్చింది. దేశం నుంచి మొత్తం 157 మంది సెలక్ట్ కాగా అందులో మహిళలు 19మంది ఉన్నారు.
 
దక్షిణ భారత దేశం నుంచి లక్ష్మి మాధవి ఒక్కరే ఎంపికై అరుదైన ఘనత సాధించింది. ఏడాది పాటు ప్రపంచ పోలీస్ శాఖకు లక్ష్మీ మాధవి సేవలు అందించనుంది. సంకల్పం, మనోధైర్యం ఉంటే.. సాధించలేనిది ఏదీ లేదని లక్ష్మి నిరూపించారు.