బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By Eswar
Last Modified: సోమవారం, 7 జులై 2014 (15:13 IST)

హైదరాబాదులో లావణ్య ఇడ్లీ దోశ రెడీ... స్వయంకృషితో....

నగర జీవితం నరక యాతన అన్నాడో సినీకవి. గతంలో భర్త సంపాదిస్తుంటే భార్య ఇంటికే పరిమితమై ఇంటిపని, వంటపని చేసుకుంటూ ఉండేది. నేడు భార్యాభర్తలిద్దరూ కష్టపడి ఉద్యోగాలు చేస్తేనేగానీ జీవన గమనం ముందుకు సాగని పరిస్థితి. ఇలాంటప్పుడు ఆఫీసులోనూ ఇంట్లోనూ పనులతో సతమతమయ్యే మహిళ వంట చేసుకునేందుకు పరుగులు పెట్టాల్సిన అవస్థలు లేకుండా కొన్నికొన్ని రెడీమేడ్ పదార్థాల తయారీలో పరిశ్రమను నెలకొల్పి పదుగురికి ఉపాధి కల్పిస్తున్నారు లావణ్య.
 
కోయంబత్తూరులో పుట్టి పెరిగిన లావణ్య తన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత కొంతకాలం ఉద్యోగం చేశారు. పెళ్ళైన తర్వాత ఉద్యోగం మీద ఆసక్తి తగ్గిపోయిన లావణ్య మహిళల కోసం ఏదైనా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకున్నారు. భర్త కూడా ప్రోత్సాహాన్ని అందించడంతో ఇడ్లీ, దోశ తడి పిండి తయారుచేసి మహిళలకు ఉపయోగపడే విధంగా ఇండస్ట్రీని స్థాపించారు. ఉద్యోగం చేసే మహిళలు ఉదయాన్నే లేచి టిఫిన్ తయారుచేసి వంట చేసి పిల్లల్ని రెడీ చేసి ఉద్యోగానికి వెళ్ళడం కష్టం అవుతూ ఉంటుంది. అందుకే అలాంటి వారికి ఊరటగా ఉండేందుకు రెడీమేడ్‌గా ఇడ్లీ దోశ వండుకునేందుకు వీలైన తడి పిండిని తయారుచేయడం మొదలుపెట్టారు లావణ్య.
 
మొదట్లో 5 నుండి 10 కిలోల వరకు పిండిని వేస్తూ ఇంట్లోనే గ్రైండర్ ద్వారా వ్యాపారాన్ని ప్రారంభించారు. చుట్టుపక్కల ఇళ్ళకు వెళ్లి ఆ పిండి యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ డోర్ టు డోర్ మార్కెటింగ్ చేసి వ్యాపారాన్ని మెల్లగా  హైదరాబాద్ అంతటా విస్తరించారు.
 
2010 నవంబర్ 24 న ప్రారంభించిన తన ఇండస్ట్రీకి లావణ్య అని తన పేరే పెట్టి తద్వారా మహిళల్లో చైతన్యం కూడా తీసుకువస్తున్నారు. ఒక మహిళ ప్రారంభించిన సంస్థ కాబట్టి త్వరగానే ప్రజల్లో పాపులర్ అయిపోయింది. క్రమక్రమంగా 20 నుండి 50 కేజీల వరకు వ్యాపారం విస్తరించింది. అప్పుడు చుట్టుపక్కల ఉన్న కిరాణా షాపులకు వెళ్లి తమ ప్రొడక్ట్ గురించి వివరించి మార్కెటింగ్ మొదలుపెట్టారు లావణ్య. 
 
100 కేజీల నుండి 150 కిలోల వరకు కూడా అమ్మకాలు పెరిగిన లావణ్య ప్రొడక్ట్స్ ఒక సంవత్సర కాలంలోనే 200 కిలోల వరకు ఇంప్రూవ్ అయ్యాయి. సమీపంలో ఉన్న సూపర్ మార్కెట్‌లలో కూడా తమ ఉత్పత్తులను పరిచయం చేసిన లావణ్య అక్కడ కూడా విజయం సాధించారు. తమ ఉత్పాదనల్లో ఏమైనా లోపాలున్నాయేమోనని కస్టమర్లను స్వయంగా అడిగి తెలుసుకుంటారు లావణ్య. ఇప్పటివరకు రెగ్యులర్ కస్టమర్లు 1000 మంది లావణ్య ఉత్పాదనలనే వాడుతున్నారు. బైట మార్కెట్‌లో దొరికే వాటి కంటే సగం ధరకే నాణ్యత కలిగిన మంచి పదార్థాలను లావణ్య అందించడంతో కస్టమర్ల నుండి మంచి ప్రోత్సాహం, అభినందనలు కూడా అందుకుంటున్నారు లావణ్య. 
 
త్వరలో తమ బ్రాండ్ నుండి డయాబెటిక్ ఫ్రీ ఇడ్లీ, డయాబెటిక్ ఫ్రీ దోశ, మల్టీ గ్రైన్ దోశ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్న లావణ్య రెడీ టు కుక్ చపాతీ, పూరీ, హైజెనిక్ కండిషన్లో తయారుచేసి ఇవ్వాలన్నది మోటివ్‌గా పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. ఆఫీసులకు వెళ్ళే స్త్రీలు ప్రశాంతంగా పనులు పూర్తిచేసుకుని వెళ్ళాలన్నది తన ఉద్దేశ్యమని చెప్తారు లావణ్య.