రాయల్స్ నడ్డి విరిచిన రైజర్స్, ఫైనల్లో సన్ రైజర్స్ vs నైట్ రైడర్స్
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్స్ నడ్డి విరిచింది. పటిష్టమైన బౌలింగుతో పరుగులు రాకుండా కట్టడి చేయడమే కాకుండా అద్భుతమైన ఫీల్డింగుతో రాణించింది. ఫలితంగా 36 పరుగుల తేడాతో రాయల్స్ జట్టు సన్ రైజర్స్ చేతిలో ఓటమి పాలైంది. దీనితో సన్ రైజర్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం రాత్రి ఎం.ఎ స్టేడియంలో ఫైనల్ పోటీలో నైట్ రైడర్స్ జట్టుతో సన్ రైజర్స్ తలపడుతుంది.
176 పరుగుల విజయ లక్ష్యంతో క్రీజులోకి దిగిన రాయల్స్ జట్టులో తొలుత యశస్వి జైస్వాల్ మెరుపు మెరిపించాడు. 21 బంతుల్లో 42 పరుగులు చేసిన సన్ రైజర్స్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. ఐతే నాలుగో ఓవర్లో కోహ్లెర్(10) ఔటయ్యాడు. ఆ తర్వాత వికెట్ల పతనం ప్రారంభమైంది. సంజూ శాంసన్ 10 పరుగులు, రియాన్ 6 పరుగులకే ఔటయ్యారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్సమన్‌గా వచ్చిన ధ్రువ్ జురెల్ చివరి వరకూ ఒంటరి పోరాటం చేసాడు. ఇతడికి సహకారం లేకపోయింది. రవిచంద్రన్ అశ్విన్ డకౌట్ అయ్యాడు. హెట్మెర్ 4 పరుగులు, పోవెల్ 6 పరుగుల వద్ద ఔటయ్యారు. ట్రెంట్ బౌల్ట్ పరుగులేమీ చేయలేదు. ఐతే ధ్రువ్ చివరి దాకా ఆడాడు. 35 బంతుల్లో 56 పరుగులు చేసినా ఫలితం దక్కలేదు. తోటి బ్యాట్సమన్లు హ్యాండివ్వకపోవడంతో రాయల్స్ పరాజయం పాలైంది.