స్పెక్ట్రమ్‌పై పట్టువీడని ప్రతిపక్షాలు .. మెట్టుదిగని ప్రభుత్వం!
2-
జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై దర్యాప్తుకు సంయుక్త పార్లమెంటు కమిటీ (జెపిసి)ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌పై విపక్షాలు ఏమాత్రం పట్టు సడలించడంలేదు. అలాగే, ప్రభుత్వం కూడా ఒక్క మెట్టుకూడా దిగడంలేదు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సభా కార్యక్రమాలు పూర్తిగా స్తంభించి పోయిన విషయం తెల్సిందే. ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి మంగళవారం లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం కూడా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. స్పెక్ట్రమ్ కుంభకోణంపై దర్యాప్తుకు జెపీసీని ఏర్పాటు చేయనట్లయితే పార్లమెంటు పని చేయడానికి అనుమతించే ప్రసక్తే లేదని సమావేశంలో ప్రతిపక్షాలు తేల్చి చెప్పాయి. అయితే ప్రతిపక్షాల డిమాండ్‌ను అంగీకరించేది లేదని ప్రభుత్వం కూడా మరోసారి పునరుద్ఘాటించింది. అయితే, జేపీసీకి బదులుగా ఈ కుంభకోణంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరిపిస్తామని ప్రభుత్వం చెప్పగా, జెపీసీకి మినహా మరోరకమైన దర్యాప్తునకు అంగీకరించే ప్రసక్తే లేదని విపక్షాలు కుండబద్ధలు కొట్టినట్టు చెప్పాయి. ఫలితంగా రెండున్నర గంటల పాటు సాగిన అఖిలపక్ష సమావేశం నిష్పలంగా ముగిసింది.