సోమవారం, 11 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. కథనాలు
Written By PNR
Last Updated : బుధవారం, 30 జులై 2014 (13:09 IST)

ధ్యాన్‌చంద్‌కు ద్రోహం: సచిన్‌కు భారత రత్న ఇచ్చిన యూపీఏ!

హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌కు ద్రోహం చేసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు యూపీఏ సర్కారు భారత రత్న పురస్కారాన్ని ప్రదానం చేసింది. భారత అత్యున్నత పురస్కారమైన భారత రత్నకు ధ్యాన్‌చంద్ పేరును దాదాపుగా ఖరారు చేయగా, చివరి రెండురోజుల్లో ఆయన పేరును తొలగించి, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరును ఎంపిక చేసింది. ఈ మేరకు హెడ్‌లైన్స్ టు డే పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండగా, ఇది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విశ్వసనీయతను శంకించేలా ఉంది. 
 
వాస్తవానికి భారత రత్న పురస్కారం క్రీడాకారులకు ఇచ్చే సంప్రదాయం మన దేశంలో లేదు. అయితే, హాకీలో మూడుసార్లు భారత్‌కు ఒలింపిక్స్ బంగారు పతకాలను సాధించిపెట్టిన ధ్యాన్‌చంద్‌కు భారత రత్న ఇవ్వాలని చాలాకాలం నుంచి పలు క్రీడా సంఘాలతో పాటు ప్రజల నుంచి కూడా డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వం, భారత రత్న గ్రహీతల జాబితాలో క్రీడాకారులను కూడా చేరుస్తూ సవరణలు చేసింది. ఆ ప్రకారం ధ్యాన్‌చంద్ వివరాలను క్రీడా మంత్రిత్వ శాఖ సేకరించి, భారత రత్నకు ఆయన పేరును ఖరారు చేసింది. 
 
అయితే, ఉన్నపళంగా ధ్యాన్‌చంద్ స్థానంలో సచిన్ పేరు చేర్చి గతేడాది పెద్ద చర్చకే తెరలేపింది. సచిన్ కూడా క్రికెట్‌లో భారత్‌ను సమున్నత స్థానంలో నిలిపిన నేపథ్యంలో నాడు దీనిపై అంతగా వివాదం చెలరేగలేదు. తాజాగా హెడ్ లైన్స్ టుడే వెల్లడించిన కథనం ప్రకారం భారత రత్న అవార్డుల ప్రకటన వెలువడటానికి రెండు రోజుల ముందు వరకు కూడా క్రీడా శాఖ మంత్రి జితేంద్ర సింగ్ పంపిన సిఫార్సుల మేరకు సీఎన్ఆర్ రావుతో పాటు ధ్యాన్ చంద్ పేరును ఎంపిక చేశారు. 
 
అయితే ఈ అవార్డుల ప్రకటనకు సరిగ్గా రెండు రోజుల ముందుగా ప్రధాన మంత్రి కార్యాలయం, సచిన్ పూర్తి వివరాలను సాయంత్రంలోగా పంపాలని కేంద్ర క్రీడల శాఖను ఆదేశించింది. సదరు శాఖ నుంచి వివరాలను అందుకున్న మరుక్షణమే ధ్యాన్ చంద్ పేరు స్థానంలో సచిన్ పేరు చేరిపోయింది. అసలు భారత రత్న పురస్కార గ్రహీతల విభాగంలో క్రీడాకారులకు కూడా చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నదే ధ్యాన్ చంద్ కోసమైతే, చివరి నిమిషంలో ఆయన పేరును తొలగించడం ఆ హాకీ మాంత్రికుడికి ద్రోహం చేసినట్లు కాకపోతే మరేంటనేది సగటు భారతీయుడు ప్రశ్న. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత వెలుగు చూసిన ఈ కథనంపై పెద్ద ఎత్తున విమర్శలు రేగే అవకాశాలు కనిపిస్తున్నాయి.