టీజేఏసీ ప్రొఫెసర్ కోదండరామ్‌కు సిగ్గుండాలి : మంత్రి కేటీఆర్
ఓటుకు నోటు కేసులో చిప్పకూడు తిన్న టీడీపీ నేత రేవంత్ రెడ్డితో కలిసి వేదిక పంచుకోవడానికి, జబ్బలు రాసుకొని తిరగడానికి టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్‌కు సిగ్గుండాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానిం
ఓటుకు నోటు కేసులో చిప్పకూడు తిన్న టీడీపీ నేత రేవంత్ రెడ్డితో కలిసి వేదిక పంచుకోవడానికి, జబ్బలు రాసుకొని తిరగడానికి టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్‌కు సిగ్గుండాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. శుక్రవారం ఇక్కడ తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రభుత్వంపై, ప్రాజెక్టులపై విమర్శల ద్వారా కోదండరామ్ తన స్థాయిని తగ్గించుకుంటున్నారని చెప్పారు.
40 ఏళ్లుగా పూర్తి కాని ప్రాజెక్టులు తెలంగాణలో ఉన్నాయని, అన్ని పనులూ ఏకకాలంలో చేపట్టి వేగంగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తుంటే అర్థం చేసుకోకుండా కోదండరామ్ ప్రతిపక్షాలకు వంత పాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం వచ్చిందే నీళ్ల కోసం కాదా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా టెంటు వేస్తే ఆ వేదికను పంచుకుంటారా? విద్యావంతులు, మేధావులు చేయాల్సిన పనేనా ఇది? ములుగు జిల్లా కావాలని ఆందోళనలు చేస్తే అక్కడ పాల్గొంటారా? ఆచార్య జయశంకర్ పేరిట జిల్లా ఏర్పాటు చేశాం కదా? అని ప్రశ్నించారు.
'ప్రగతి భవన్‌పైనా విమర్శలు చేస్తావా? అది కేసీఆర్ సొంత ఆస్తి కాదు. ఎవరు ముఖ్యమంత్రి అయితే వారికే కదా. ప్రైవేటు కార్యక్రమాలు చేపడితే తప్పు పట్టాలి. ప్రజల అవసరాల కోసం చేసే వాటిని కూడా తప్పుపడతావా? డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తాం. రెండున్నరేళ్లలో లక్షల్లో ఇళ్లు నిర్మిస్తాం. హైదరాబాద్‌లోనే లక్ష ఇళ్లు నిర్మిస్తాం' అన్నారు. 'ఆరోపణలు కాదు. ఆధారాలు వెల్లడించండి. కోర్టుకు వెళ్లండి' అని విపక్షాలకు సలహా ఇచ్చారు.