శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : గురువారం, 23 మే 2019 (06:24 IST)

#ElectionResults2019 : టిక్.. టిక్.. టిక్... తొలి ఫలితం నర్సాపూర్.. చిట్టచివరన రాజమండ్రి

సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 11వ తేదీన ముగిసింది. ఫలితాల కోసం గత 42 రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఈ ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. ఈ ఎన్నికల్లో గెలిచేదెవరో.. ఓడిపోయేది ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు అభివృద్ధికే పట్టం కట్టారా..? లేదా రాజన్న పాలన అందిస్తానంటున్న వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని తొలిసారి అందలమెక్కించారా? అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇందులోభాగంగా, ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత తొలి ఫలితం మధ్యాహ్నం 2 గంటలకంతా వెల్లడయ్యే అవకాశం ఉంది. 
 
ఇదిలావుంటే, తొలి ఫలితం నర్సాపురం అసెంబ్లీ స్థానం నుంచి వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే.. అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు వేర్వేరుగా 14 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కౌంటింగ్‌ హాలు సామర్థ్యం తక్కువగా ఉన్న చోట 7 టేబుళ్లపై కూడా ఓట్లను లెక్కించనున్నారు. ఎక్కువగా ఉన్న కౌంటింగ్‌ కేంద్రాల్లో గరిష్టంగా 20 టేబుళ్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే అతితక్కువగా కృష్ణా జిల్లా నందిగామలో 7 టేబుళ్లు పెట్టారు. తిరుపతి, మదనపల్లి, పుంగనూరు, చంద్రగిరి నియోజకవర్గాల్లో 20 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. తొలి ఫలితం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంపై వెలువడుతుంది. ఇక్కడ 13 రౌండ్లలో లెక్కింపు పూర్తికానుంది. ఆచంట, కొవ్వూరులలో 14 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది.
 
ఇకపోతే, చివరి ఫలితం రాజమండ్రి నుంచి వెలువడనుంది. రంపచోడవరం, రాజమండ్రి రూరల్‌, అమలాపురం, జగ్గంపేటల్లో ఓట్ల లెక్కింపునకు సుదీర్ఘ సమయం తీసుకుంటుంది. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 234 పోలింగ్‌ స్టేషన్ల ఓట్లను 14 టేబుళ్లపై... 34 రౌండ్లలో లెక్కిస్తారు. జగ్గంపేటలో 35 రౌండ్లలో లెక్కిస్తారు. రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గంలో 256 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ 14 టేబుళ్లపై 37 రౌండ్లలో కౌంటింగ్‌ జరుగుతుంది.