నవ్యాంధ్ర 2వ శాసనసభ ఎన్నికలకు సర్వంసిద్ధం.. త్రిముఖ పోటీ.. సర్వత్రా ఆసక్తి

election campaign
Last Updated: బుధవారం, 10 ఏప్రియల్ 2019 (16:30 IST)
మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. 2014 జూన్ 2వ తేదీన రెండు ముక్కలుగా విడిపోయింది. వీటిలో ఒకటి 13 జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాగా, రెండోది 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రాంతం. అయితే, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 15వ అసెంబ్లీ ఎన్నికలు (నవ్యాంధ్రలో 2వ శాసనసభ ఎన్నికలు) జరుగనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. ఈ సందర్భంగా 1957 నుంచి 2014 వరకూ జరిగిన 14 ఎన్నికల హైలైట్స్ ఓసారి చూద్దాం.

హైదరాబాద్‌లోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు, ఆంధ్ర రాష్ట్రం కలిసి 1956లో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను 1957లో మొట్టమొదటిసారిగా నిర్వహించారు. ఈ ఎన్నికలు కేవలం తెలంగాణ ప్రాంతానికి మాత్రమే నిర్వహించారు. మొత్తం 104 నియోజకవర్గాలకు కాంగ్రెస్ 68 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ మెజార్టీ ఉండటంతో ఇరు ప్రాంతాలకు నీలం సంజీవరెడ్డి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. నీలం సంజీవరెడ్డి 1960 వరకు, దామోదర సంజీవయ్య 1962 వరకు ముఖ్యమంత్రులుగా పనిచేశారు.

ఆ తర్వాత ఐదేళ్లకు అంటే 1962లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 300 స్థానాలకు పోటీ జరిగితే కాంగ్రెస్ 177 స్థానాలు నెగ్గి భారీ మెజార్టీతో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కమ్యూనిస్టు పార్టీ 51 స్థానాలకే పరిమితమైంది. ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి 1964 వరకు, ఆ తర్వాత కాసు బ్రహ్మానంద రెడ్డి 1967 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు.

1967 శాసనసభ ఎన్నికల్లో 287 స్థానాలకూ పోటీచేసిన కాంగ్రెస్ 165 స్థానాలు కైవసం చేసుకొని ఆంధ్రప్రదేశ్‌లో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు 401 మంది పోటీ చేయగా 68మంది గెలుపొందారు. స్వతంత్ర పార్టీ 90 స్థానాల్లో పోటీ చేసి 29 స్థానాల్లో విజయం సాధించింది. ఈ దఫా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

1972 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్‌కు ఎదురేలేకుండాపోయింది. వరుసగా అయిదోసారి భారీ మెజార్టీతో అధికారం చేజిక్కించుకొంది. మొత్తం 287 నియోజకవర్గాలలో పోటీకి దిగి 219 స్థానాలతో ప్రభంజనం సృష్టించింది. మిగిలిన పార్టీలలో ఏ పార్టీకి కనీసం రెండంకెల్లో సీట్లు సైతం దక్కలేదు. పి.వి.నరసింహారావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా కేవలం ఏడాదికాలంలోనే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 1973 జనవరిలో రాష్ట్రపతి పాలన విధించారు.

అదే యేడాది డిసెంబరు నెలలో రాష్ట్రపతి పాలన ఉపసంహరించిన తర్వాత జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా బాధ్యతలుచేపట్టారు. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో 294 నియోజకవర్గాలకు పోటీ జరిగితే ఇందిరా కాంగ్రెస్ పార్టీ 290 స్థానాల్లో పోటీ చేసి 175 స్థానాల్లో విజయం సాధించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలకు గండి కొట్టింది. 1978 నుంచి 1980 వరకు మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1982 వరకు టంగుటూరి అంజయ్య, భవనం వెంకటరామి రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించారు.

1983 అసెంబ్లీ ఎన్నికల ద్వారా సినీ నటుడు స్వర్గీయ ఎన్టీ.రామారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. మొత్తం 294 నియోజకవర్గాల్లో టీడీపీ 290 నియోజకవర్గాలకు పోటీచేసి 201 సీట్లు సొంతం చేసుకోడం ద్వారా కాంగ్రెస్ హవాకు చెక్ పెట్టడమే కాకుండా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఇందిరా గాంధీ సహకారంతో ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసి 1984 నాదెండ్ల భాస్కరరావు 31 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్ సీఎం అయ్యారు. 1985 అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ జోరే కొనసాగింది. 250 స్థానాల నుంచి పోటీ చేసిన టీడీపీ 202 స్థానాలు నెగ్గి భారీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఎన్టీ రామారావు మళ్లీ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 1989 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ 181 స్థానాలతో అధికారం దక్కించుకుంది. టీడీపీ కేవలం 74 స్థానాలకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం మర్రి చెన్నారెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది.

అయితే, కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు కారణంగా ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. మర్రి చెన్నారెడ్డి తర్వాత 1990-92లో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, 1992-94 వరకు కోట్ల విజయభాస్కర్ రెడ్డిలు సీఎంలుగా పని చేశారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పడిలేచిన కెరటంలా దూసుకొచ్చి తిరిగి అధికారం అందుకొంది. 216 సీట్లు నెగ్గడం ద్వారా రాష్ట్రపగ్గాలు చేతిలోకి తీసుకొంది. 1994-95 వరకు ఎన్టీఆర్ సీఎంగా ఉన్నారు. అయితే, 1995లో నారా చంద్రబాబు నాయుడు మామను పదవి నుంచి దించేసి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ విజయం సాధించింది. 180 స్థానాలు నెగ్గడం ద్వారా అధికారం అందుకొంది. దీంతో చంద్రబాబు నాయుడు రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

కానీ, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్.రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించింది. 185 స్థానాల్లో నెగ్గడం ద్వారా మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకుంది. వైఎస్.రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత ఐదేళ్లకు జరిగిన 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అధికారాన్ని నిలుపుకొంది. 294 స్థానాల నుంచి పోటీకి దిగిన కాంగ్రెస్ 156 స్థానాల్లో విజేతగా నిలవడం ద్వారా అధికారం తిరిగి హస్తగతం చేసుకుంది. ఫలితంగా వైఎస్ఆర్ రెండోసారి సీఎంగా ఎంపికయ్యారు.

2009 సెప్టెంబర్‌లో వైఎస్ మరణం తర్వాత 2009-10లో కొణిజేటి రోశయ్య, 2010-14 వరకు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా పని చేశారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌కు తొలి ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 103 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టింది. ప్రస్తుత 2019 ఎన్నికల్లో మాత్రం సైతం బరిలో నిలవడంతో ముక్కోణపు సమరం జరుగుతోంది. ఫలితంగా మునుపెన్నడూ లేనివిధంగా నవ్యాంధ్ర ఎన్నికలు సరికొత్త ఆసక్తితో పాటు ఉత్కంఠతను రేపుతున్నాయి.దీనిపై మరింత చదవండి :