గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 17 అక్టోబరు 2017 (14:33 IST)

శవాల మిస్టరీ... ఐదుగురు ఆత్మహత్య.. అన్నీ అనుమానాలే?

రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ఇంద్రారెడ్డికంచెలో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. చెట్ల పొదల్లో మూడు.. కారులో రెండు మృతదేహాలు ఉన్నాయి. మృతుల్లో మ

రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ఇంద్రారెడ్డికంచెలో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. చెట్ల పొదల్లో మూడు.. కారులో రెండు మృతదేహాలు ఉన్నాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. వీరిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు కాగా.. మరో ఇద్దరు సమీప బంధువులు. మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. నార్సింగ్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కారులో తండ్రి, కుమారుడి మృతదేహాలు ఉండగా.. చెట్ల పొదల్లో మిగతావారి మృతదేహాలు లభించాయి. 
 
మృతులను అమీన్‌పూర్‌ గ్రామానికి చెందిన ప్రభాకర్‌ రెడ్డి(28), ఆయన భార్య మాధవి(25), వారి కుమారుడు వర్షిత్‌(3), మాధవి అక్క లక్ష్మి(40), ఆమె కూతురు సింధూజ(16)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా శ్రీశైలం వెళ్తున్నామని స్థానికులకు చెప్పి వెళ్లినట్లు సమాచారం. మృతదేహాలు ఉన్న కారు నంబర్‌(ఏపీ 28 డీఎం 3775)ఆధారంగా మరిన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
 
ఘటనాస్థలికి సైబరాబాద్‌ సీపీ సందీప్‌ శాండిల్య చేరుకొని పరిశీలించారు. అమీన్‌పూర్‌ పోలీసుస్టేషన్‌లో రెండు రోజుల క్రితం వీరిపై అదృశ్యం కేసు నమోదైనట్లు చెప్పారు. మృతులందరినీ బంధువులుగా భావిస్తున్నట్లు చెప్పారు. ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా హత్య చేశారా?.. అనే కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు. శవపంచనామా అనంతరం మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. 
 
ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీ భర్త రవీందర్ రెడ్డి ఘటనా స్థలంలో మీడియాతో మాట్లాడుతూ తమకు ఎలాంటి ఆర్థిక కష్టాలు లేవన్నారు. ప్రభాకర్ రెడ్డి, తాను కలిసి స్టాక్ మార్కెట్ వ్యాపారం చేస్తూ వచ్చామన్నారు. శ్రీశైలం వెళుతున్నామని చెప్పారని, సోమవారం కూడా ఫోనులో మాట్లాడితే రాత్రికి వస్తామని చెప్పారని తెలిపారు. కాగా, రవీందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలు తోడల్లుళ్ళు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. అయితే, ఈ ఐదుగురి ఆత్మహత్యల్లో అన్నీ అనుమానాలే తలెత్తుతున్నాయి.