అయ్యో.. ఒక్క స్ట్రెచర్ లేకపోవడం ఒక ప్రాణాన్ని బలిగొంది...
తిరుపతి రుయా ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. జ్వరంతో వచ్చిన బాబు అనే వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించుకోలేదు వైద్య సిబ్బంది. జ్వరం ఎక్కువై ఫిట్స్ రావడంతో రోడ్డుపైన పడిపోయాడు బాబు. ఎమర్జెన్సీకి తీసుకెళ్ళేందుకు స్ట్రెచర్ లేకపోవడంతో ఇబ్బంది పడ్డారు కుటుంబ సభ్యులు. దీంతో అటుగా వెళుతున్న ఒక వ్యక్తి రోగుల వార్డులోకి వెళ్ళి స్ట్రెచర్ తీసుకొచ్చి బాబును పైన పడుకోబెట్టి ఎమర్జెన్సీకి తీసుకెళ్ళే ప్రయత్నం చేశాడు.
అయితే బాబు మార్గమధ్యంలోనే చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు వైద్య సిబ్బందిని ప్రశ్నించారు. కనీసం స్ట్రెచర్ కూడా లేకపోతే ఎలా అని ప్రశ్నించడంతో వైద్య సిబ్బంది బాబును తీసుకొచ్చిన వ్యక్తితో వాగ్వాదానికి దిగారు. మీ ఇష్టమొచ్చిన వారికి చెప్పుకో అంటూ వైద్య సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు.