తిరుపతి బరిలో బీజేపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థి : జీవీఎల్

gvl narasimha
ఠాగూర్| Last Updated: బుధవారం, 25 నవంబరు 2020 (13:12 IST)
తిరుపతి లోక్‌సభకు జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ - జనసేన పార్టీల తరపున ఉమ్మడి అభ్యర్థి పోటీ చేస్తారని భాజపా సీనియర్ నేత జీవీఎల్ నరసింహా రావు చెప్పారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు. టీడీపీ సైతం తన సత్తా ఏంటో చూపించాలని భావిస్తోంది. అధికార వైకాపా కూడా తాము ప్రవేశపెట్టిన పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పుకోవాలంటే ఇక్కడ గెలిచితీరాలన్న కసితో ఉన్నాయి.

ఇకపోతే తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల అంశంపై మాట్లాడేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. ఈ తరుణంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని జీవీఎల్ చెప్పారు.

తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఏపీలో అభివృద్ధి లేదని అన్నారు. రాష్ట్రంలో కేవలం కుల, ధన రాజకీయాలు మాత్రమే ఉన్నాయన్నారు. తిరుపతి అభివృద్ధి కోసం వైసీపీ, టీడీపీలు ఏం చేశాయో ముందు చెప్పాలని... ఏమీ చేయకుండానే ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నాయో వెల్లడించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పాలనలో అంతులేని అవినీతి జరిగిందని చెప్పారు. తెదేపా హయాంలో అవినీతి కోసమే అభివృద్ధి జరిగిందని విమర్శించారు. తిరుపతి ప్రాంతంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు బీజేపీ పూర్తిగా సహకరిస్తుందని అన్నారు.దీనిపై మరింత చదవండి :