శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 మే 2021 (09:21 IST)

అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం: జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు

కరోనా నేపథ్యంలో ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ మరియు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ 19 చికిత్స కోసం కొత్త ధరలను ప్రభుత్వం ప్రకటించిందని, జిల్లాలో నోటిఫై చేసిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ 19 చికిత్స కోసం ప్రభుత్వం నిర్ణయించిన ధరలనే వసూలు చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఒక ప్రకటనలో తెలిపారు. 
 
కోవిడ్ 19 చికిత్సను అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందజేస్తారన్నారు. చాలా ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్ చికిత్సకు అధిక ధరలు వసూలు చేస్తున్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ మరియు ప్రైవేట్ హాస్పిటల్స్‌‍లో కోవిడ్ చికిత్స కోసం ప్రభుత్వం గతంలో జారీచేసిన ఫీజులను సవరించి కొత్త ధరలను నిర్ణయించిందన్నారు. 
 
ప్రభుత్వం నిర్దేశించిన ధరల్లో కన్సల్టెన్సీ, నర్సింగ్ ఛార్జీలు, గది అద్దె, భోజనం, కోవిడ్ పరీక్షల రుసుము, పీపీఈ కిట్లు, ఔషధాలు ఉంటాయన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలనుకాకుండా అధిక డబ్బులు వసూలు చేస్తే అలాంటి ప్రైవేట్ ఆస్పత్రుల పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
కోవిడ్ చికిత్స కోసం ప్రభుత్వం ప్రకటించిన ధరలను జిల్లా కలెక్టర్ తెలిపారు.
 
* నాన్ క్రిటికల్ కోవిడ్ ట్రీట్మెంట్ కోసం ఎన్ఏబిహెచ్ ఆస్పత్రుల్లో ఒక రోజుకు 4,000 రూపాయలు, నాన్ ఎన్ఏబిహెచ్ ఆస్పత్రుల్లో ఒక రోజుకు 3,600 రూపాయలు వసూలు చేయాలన్నారు.
 
* క్రిటికల్‌కు సంబంధించి నాన్ క్రిటికల్ కోవిడ్ ట్రీట్మెంట్ విత్ 02 కోసం ఎన్ఏబిహెచ్ ఆస్పత్రుల్లో ఒక రోజుకు 6,500 రూపాయలు, నాన్ ఎన్ఏబిహెచ్ ఆస్పత్రుల్లో ఒక రోజుకు 5,850 రూపాయలు వసూలు చేయాలన్నారు.
 
* క్రిటికల్ కేర్‌కు సంబంధించి క్రిటికల్ కేర్ ట్రీట్మెంట్ ఇన్ ఐసీయూ విత్ ఎన్ఐవి (సిపిఎపి, బిఐపిఎపి, హెచ్ఎఫ్ఎన్ఓ) కోసం ఎన్ఏబిహెచ్ ఆస్పత్రుల్లో ఒక రోజుకు 12,000 రూపాయలు, నాన్ ఎన్ఏబిహెచ్ ఆస్పత్రుల్లో ఒక రోజుకు 10,800 రూపాయలు వసూలు చేయాలన్నారు.
 
* క్రిటికల్ కేర్‌కు సంబంధించి క్రిటికల్ కోవిడ్ ట్రీట్మెంట్ ఇన్ ఐసీయూ విత్ వెంటిలేటర్ ఆధారంగా చికిత్స కోసం ఎన్ఏబిహెచ్ ఆస్పత్రుల్లో ఒక రోజుకు 16,000 రూపాయలు, నాన్ ఎన్ఏబిహెచ్ ఆస్పత్రుల్లో ఒక రోజుకు 14,400 రూపాయలు వసూలు చేయాలన్నారు.

* అలాగే సిటీ స్కాన్ తీస్తే (ఫిల్మ్, రిపోర్ట్ తో కలిపి) 3,000 రూపాయలు వసూలు చేయాలన్నారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ఒకటి 2,500 రూపాయలు, టోసిలిజుమాబ్‌కు 30,000 రూపాయలు వసూలు చేయాలన్నారు. 
 
* ప్రభుత్వం ప్రకటించిన ధరల పట్టికను నోటిఫై చేసిన అన్ని  ప్రైవేట్ ఆస్పత్రుల్లో  ప్రదర్శించాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరలకన్నా అధిక ధరలను వసూలు చేస్తే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం, ఐపిసి యొక్క నిబంధనల ప్రకారం  చర్యలు తప్పవన్నారు.
 
* చికిత్స ఆధారంగానే ఫీజులు ఉండాలే తప్ప ప్యాకేజీల రూపంలో వసూళ్లకు పాల్పడ్డ కూడదని ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టం చేసిందన్నారు. జిల్లాలో  నోటిఫై చేసిన కోవిడ్ ఆస్పత్రుల్లో కరోనా బాధితులను తప్పనిసరిగా అడ్మిట్ చేసుకోవాలన్నారు. అడ్వాన్స్ వసూలు చేయరాదని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.