శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 15 సెప్టెంబరు 2019 (18:48 IST)

బోటు మునకపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి : సీఎం జగన్ సీరియస్..

పాపికొండల్లో ఆదివారం జరిగిన బోటు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దీనిపై ఆయన ఓ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో ఓ బోటు నదిలో మునిగిపోయిందని తెలిసి ఎంతో బాధపడుతున్నానని తెలిపారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 
 
విషాద ఘటన జరిగిన ప్రదేశంలో ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయని మోదీ ట్వీట్ చేశారు. కాగా, తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 12 మంది మృత్యువాత పడ్డారు. పడవలో 61 మంది ఉండగా, అనేకమంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. 
 
అలాగే, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ ప్రమాదంపై స్పందించారు. బోటు ప్రమాదం వివరాలు తెలుసుకున్న జగన్‌.. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. నేవీ, ఓఎన్జీసీ హెలికాప్టర్ల సహాయం తీసుకోవాలని సీఎం సూచించారు. అందుబాటులో ఉన్న మంత్రులు ఘటనాస్థలానికి వెళ్లాలని జగన్ ఆదేశించారు. 
 
తక్షణమే బోటు సర్వీసులన్నీ నిలిపివేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమాదంపై ఎప్పటికప్పుడు వివరాలు తెలపాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడిన జగన్.. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.
 
అంతేకాకుండా, 'ప్రయాణానికి ఆ బోట్లు అనుకూలమా? కాదా? అన్న దానిపై క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. లైసెన్స్‌లు పరిశీలించాలని బోట్లను నడిపేవారు.. అందులో పనిచేస్తున్నవారికి తగిన శిక్షణ, నైపుణ్యం ఉందా? లేదా అనేది తనిఖీ చేయాలి. ముందస్తు జాగ్రత్తలు బోట్లలో ఉన్నాయా? లేదా? పరిశీలించాలి. నిపుణులతో పటిష్టమైన మార్గదర్శకాలు తయారుచేసి నాకు నివేదించాలి' అని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. 
 
కాగా.. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ ఐదు మంది మృతదేహాలు వెలికి తీశారు. మరోవైపు సహాయక చర్యలకు అవకాశాలపై అధికారులు సమీక్షిస్తున్నారు. సహాయక చర్యల కోసం రెండు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.