వింత వ్యాధి నుంచి బయటపడిన ఏలూరు ప్రజలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే కాదు.. అటు జాతీయ స్థాయిలో ఏలూరు పట్టణంలో వెలుగు చూసిన వింత వ్యాధి ప్రకంపనలు రేపింది. ఈ వ్యాధిబారినపడిన వందల మంది ఆస్పత్రి పాలయ్యారు. దీంతో ఏలూరు పట్టణ వాసులంతా ప్రాణభయంతో వణికిపోయారు. అయితే, ఈ వింత వ్యాధి దాదాపుగా మాయమైంది. గడచిన మూడు రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఈ వింత వ్యాధి నుంచి ఏలూరు బయటపడిందని ప్రకటించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్, ఏలూరు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇదేసమయంలో ఈ వ్యాధి సోకడానికిగల కారణాలపై ఉన్నతాధికారుల నివేదిక కూడా ప్రభుత్వానికి అందుతుంది. ఆపై వ్యాధి కారణాలను వివరించనున్న ప్రభుత్వం, ఏలూరు విముక్తమైందని ప్రకటిస్తుందని తెలుస్తోంది.
కాగా, ఇటీవల వెస్ట్ గోదావరి జిల్లాలోని ఏలూరు పట్టణంలో కలుషిత నీరు తాగడం వల్లే ఈ వ్యాధి సంభవించిందని, రక్తంలో పరిమాణానికి మించి లోహాలు చేరడమే ప్రజలను అస్వస్థతకు గురిచేసినట్టు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌కు చెందిన నిపుణులతో కూడిన వైద్య బృందం తేల్చిన విషయం తెల్సిందే.